
రైల్వే ప్రయాణికులకు తీపికబురు. ఆన్‌లైన్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఎదురయ్యే సర్వర్ సమస్యలు, వెబ్‌సైట్ స్లో అవడం, అధిక ట్రాఫిక్ వంటి ఇబ్బందులను తగ్గించేందుకు ఐఆర్‌సీటీసీ (IRCTC) భారీ సాంకేతిక అప్‌గ్రేడ్ చేపడుతోంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్లు, పండుగల సమయంలో టికెట్లకు భారీ డిమాండ్ ఉన్నప్పుడు ఈ మార్పులు ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వ్యవస్థ నిమిషానికి సుమారు 37,000 టికెట్లను ప్రాసెస్ చేయగల సామర్థ్యంతో ఉంది. కొత్త మౌలిక సదుపాయాల అప్‌గ్రేడ్ పూర్తయితే ఈ సామర్థ్యాన్ని నిమిషానికి లక్షకు పైగా టికెట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సర్వర్లు, స్టోరేజ్, నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్ తదితర కీలక వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ ఆధునీకరణ కోసం ఐఆర్‌సీటీసీ సుమారు రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.
బుకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా యాక్టివ్-యాక్టివ్ డిజాస్టర్ రికవరీ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఒక వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తినా మరో వ్యవస్థ ద్వారా సేవలను కొనసాగించేలా దీనిని రూపొందిస్తున్నారు. దీంతో ముఖ్యంగా రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో బుకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశాలు తగ్గుతాయి. సికింద్రాబాద్‌ను ఈ డిజాస్టర్ రికవరీ సదుపాయానికి వేదికగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల ఐఆర్‌సీటీసీ కొత్త బీటా వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. సింపుల్, క్లీనర్ ఇంటర్‌ఫేస్‌తో రూపొందించిన ఈ వెబ్‌సైట్‌లో అనవసరమైన పాప్‌అప్స్, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్, కొన్ని CAPTCHA తనిఖీలను తగ్గించారు. అలాగే వివిధ తరగతుల సీట్ల లభ్యతను ఒకే చోట చూసే అవకాశం కల్పించారు. ప్రయాణికుల వివరాలను సేవ్ చేసుకునే సదుపాయం కూడా ఉండటంతో తరచూ రైలు ప్రయాణాలు చేసేవారికి బుకింగ్ ప్రక్రియ మరింత సులభం కానుంది. ఈ మార్పులన్నీ అమల్లోకి వస్తే రద్దీ సమయాల్లో IRCTC ద్వారా టికెట్ బుకింగ్ వేగంగా, సులభంగా, మరింత విశ్వసనీయంగా మారే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఒకే టైమ్‌లో ఎక్కువ మంది టికెట్ బుకింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో కూడా ఎలాంటి సాంకేతిక ఇబ్బందులకు అవకాశం ఉండదు. టెక్నాలజీ అప్‌గ్రేడ్ పూర్తయితే.. పండుగల సీజన్‌లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా టికెట్ బుక్ చేసుకోవచ్చు.