భయం గుప్పిట్లో ప్రపంచం.. హార్ముజ్‌ను నిర్బంధిస్తే ఏం జరుగుతుంది?
ఇరాన్-అమెరికా శాంతి చర్చలు విఫలమవడంతో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు బ్యారెల్‌కు 103 డాలర్లు దాటాయి. హార్ముజ్ జలసంధి వద్ద పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాకు ముప్పుగా మారాయి. ఇది ప్రపంచ ఇంధన కొరతకు దారి తీయవచ్చు.

ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు మళ్లీ ఉద్రిక్తతలకు గురయ్యాయి. ఇరాన్, అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత 100 డాలర్ల దిగువకు చేరిన ధర, తాజాగా మళ్లీ పెరిగి బ్యారెల్‌కు 103 డాలర్లను దాటింది. ఈ పెరుగుదలతో గ్లోబల్ మార్కెట్లలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ చుట్టూ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ కీలక జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత ప్రధాన మార్గంగా పరిగణించబడుతుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్‌ను పూర్తిగా దిగ్బంధించే అవకాశాన్ని ప్రస్తావించగా, ఇరాన్ కూడా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అక్రమంగా టోల్ చెల్లించే నౌకలను అనుమతించబోమని అమెరికా వైఖరి ఒకవైపు ఉంటే, కాల్పుల విరమణను ఉల్లంఘించే ఏ సైనిక కదలికనైనా తీవ్రంగా పరిగణిస్తామని ఇరాన్ ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి మరింత దిగజారితే, బ్యారెల్‌కు 140 నుంచి 150 డాలర్ల వరకు చేరే అవకాశముందని అంచనా.
ముఖ్యంగా హర్మూజ్ జలసంధి పూర్తిగా మూసివేస్తే రోజుకు సుమారు 12 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా అంతరాయం కలగొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరతకు దారితీసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం కొన్ని దేశాలకు చెందిన నౌకలు సాధారణంగా రాకపోకలు సాగిస్తున్నప్పటికీ, పూర్తి స్థాయి దిగ్బంధనం ఇంకా అమల్లోకి రాలేదు. అయినప్పటికీ, మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగితే, ప్రాంతీయ సమస్యగా ఉన్న ఈ ఘర్షణ గ్లోబల్ స్థాయికి చేరే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
