దేశంలో ద్రవోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు సార్లు వడ్డీ రేట్లను పెంచింది. 2022 మే నుంచి వడ్డీ రేట్ల పెంపు షురూ అయ్యింది. తాజాగా ఫిబ్రవరి 8న రెపో రేటును పెంచింది. 0.25శాతం (25 బేసిస్ పాయింట్ల)ను ఆర్బీఐ పెంచింది. దీంతో కలిపి రెపోరేటును మొత్తంగా 2.50శాతం నుంచి 6.50శాతానికి పెంచేసింది.
అయితే ఆర్బీఐ రెపో రేటు పెంచిన తర్వాత దానికి అనుగుణంగా దేశంలోని అన్ని బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను పెంచేసి కస్టమర్లకు షాకిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కూడా ఈ జాబితాలో చేరింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును దాదాపు 10 బేసిస్ పాయింట్లు పెంచేసింది. ఈ పెంపు తర్వాత ఎస్బీఐ గృహ రుణం, కారు రుణాలు, విద్యారుణాలు వంటి నెలవారీ చెల్లింపుల మొత్తంగా భారీగానే పెరగనుంది. స్టేట్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు ఇవాళ్టీ నుంచి అంటే ఫిబ్రవరి 15, 2023 నుంచి అమలులోకి వచ్చాయి.
-ఎస్బిఐ వెబ్‌సైట్ ప్రకారం, MCLRను 0.10 శాతం మేర పెంచింది.
-ఒక రోజు రుణాలపై వడ్డీ 7.85శాతం నుంచి 7.95శాతానికి పెరిగాయి.
-ఒక నెల రుణాలపై వడ్డీ 8.00శాతం నుంచి 8.10శాతానికి పెరిగాయి.
-మూడు నెలల MCLRను 8 శాతం నుంచి 8.10 శాతానికి పెంచింది.
-ఆరు నెలల MCLR 8.30 శాతం నుంచి ఇప్పుడు 8.40 శాతానికి పెరిగింది.
-ఒక సంవత్సరం MCLR 8.40 శాతం నుండి 8.50 శాతానికి పెరిగింది.
-రెండేళ్ల MCLR 8.50 శాతం నుంచి 8.60 శాతానికి పెంచింది.
-మూడేళ్లMCLR 8.60 శాతం నుంచి 8.70 శాతానికి పెంచింది.
అదే సమయంలో ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లలో మార్పులకు అనుగుణంగా ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ)లపై వడ్డీ రేట్లను ఎస్బీఐ సహా పలు బ్యాంకులు పెంచాయి. దీంతో కస్టమర్లకు అందే రాబడి మరింత పెరగనుంది. ఎఫ్‌డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచగా.. ఈ పెంపు ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి వస్తున్నట్లు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఎఫ్‌డీ రేటును ఎస్బీఐ పెంచడం గత రెండు మాసాల వ్యవధిలో ఇది రెండోసారి. డిసెంబరు 13న ఎస్బీఐ 65 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..