ఫెస్టివల్ సీజన్ విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్ లైన్స్ శుభవార్త చెప్పింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్రయాణికులకు విమాన చార్జీలపై పలు డిస్కౌంట్లను ప్రకటించింది. సాధారణంగా పండుగల సమయంలో ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. దేశ, విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం ఉండే వారు స్వదేశానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఇండిగో ఈ ఆఫర్లను ప్రకటించింది. దసరా సేల్ పేరుతో టికెట్ ధరలపై 25శాతం తగ్గింపును అందిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ 20 నుంచి అక్టోబర్ 23 వరకూ బుకింగ్ లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దీనిని డిసెంబర్ 31 వరకూ పొడిగించినట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది.
ప్రయాణికులు తమ ప్రయాణ తేదీకి ముందు వారి గమ్యస్థానాలకు మూడు రోజుల ముందుగానే తమ విమానాలను బుక్ చేసుకోవాలి. ఇండిగో కోడ్‌షేర్ కనెక్షన్‌లకు ఇది వర్తించదు . 2023 చివర్లో ప్రయాణించాలనుకునే వారికి సాదర స్వాగతం పలికేందుకు ఎయిర్‌లైన్స్ ఈ పథకాన్ని ప్రారంభించింది. గత కొన్ని నెలల్లో, ఇండిగో కొత్త గమ్యస్థానాలను కలుపుతూ ప్రపంచవ్యాప్తంగా దాని మార్గాలను విస్తరించింది. సంస్థ నెట్‌వర్క్‌లోని కొన్ని మార్గాలను తిరిగి ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని పంచుకుంటూ, వినియోగదారులకు అద్భుతమైన ప్రయాణ సేవలను అందించడానికి కట్టుబడి ఉన్నామని ఎయిర్‌లైన్ సంస్థ తెలిపింది.
అంతేకాక ఇండిగో తన 18వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రయణికులకు మరపురాని క్షణాలను సృష్టించడానికి, వారితో బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని వివరించింది. మరింత సమాచారం, వివరాల కోసం, ప్రయాణికులు ఇండిగో వెబ్‌సైట్‌ని సందర్శించాలని లేదా ఇండిగో మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
ఇండిగో హైదరాబాద్‌ను సింగపూర్, కొలంబోలను కలుపుతూ రెండు కొత్త విమానాలను ప్రారంభించింది. సింగపూర్‌కు వెళ్లే విమానం గత శుక్రవారం తెల్లవారుజామున 2:50 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 10 గంటలకు సింగపూర్ చేరుకుంటుంది. అదే విధంగా, తిరుగు ప్రయాణంలో సింగపూర్ కాలమానం ప్రకారం రాత్రి 11:25 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 1:30 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటుంది.
ఇటీవల, ఇండిగో నార్త్ గోవాలోని మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఓపీఓ) నుంచి అబుదాబికి సర్వీస్ ప్రారంభించింది. వారానికి మూడుసార్లు ఈ సర్వీస్ నడుపుతుంది. అలాగే అబుదాబి నుంచి గోవాకు సర్వీస్ కొనసాగుతుంది.. ఈ కొత్త మార్గం ద్వారా, గోవా, మిడిల్ ఈస్ట్ మధ్య పెరుగుతున్న ప్రయాణ డిమాండ్‌ను తీర్చడానికి ఇండిగో ప్రయత్నిస్తోంది. ప్రయాణికులకు అబుదాబికి నేరుగా విమానాలు అందుబాటులో ఉండే ఆరో విమానాశ్రయంగా ఎంఓపీఓ చేరింది. భారతదేశంలోని ఢిల్లీ, ముంబై, కొచ్చి, చెన్నై, హైదరాబాద్ నగరాల నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానికి నేరుగా విమానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..