
భారతదేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100కు పైగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేయాలంటే రూ.100 కన్నా తక్కువకు ఎక్కడా లభించడం లేదు. గత కొన్నేళ్లలో ఈ ధరలు విపరీతంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుతున్నప్పటికీ, భారత్‌లో పెట్రోల్ ధరలు మాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే చాలామంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు ఏటా పెరుగుతున్నాయి.
భారత్‌లో పెట్రోల్ ధరలు చాలా ఎక్కువగా ఉండగా, ప్రపంచంలోని కొన్ని దేశాల్లో లీటర్ పెట్రోల్ కేవలం రూ.2 నుంచి రూ.3కే లభిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ధరకే పెట్రోల్ లభించే దేశాలలో లిబియా ముందుంది. అక్కడ లీటర్ పెట్రోల్ ధర 0.024 డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ.2.15కు సమానం. ధరల్లో మార్పులను బట్టి ఇది సుమారు రూ.3 వరకు చేరుకోవచ్చు. లిబియా తర్వాత ఇరాన్‌లో కూడా అత్యంత చౌక ధరకే పెట్రోల్ దొరుకుతుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర 0.029 డాలర్లు, అంటే ఇండియన్ కరెన్సీలో కేవలం రూ.2.50కి లభిస్తుంది. ఇక లిబియా, ఇరాన్ తర్వాత వెనిజులా మూడో స్థానంలో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 0.035 డాలర్లు, ఇది భారతీయ కరెన్సీలో సుమారు రూ.3గా ఉంటుంది. పెట్రోల్ ధర తక్కువగా ఉన్న దేశాల్లో అంగోలా నాలుగో స్థానంలో ఉంది, ఇక్కడ లీటర్ పెట్రోల్ కేవలం రూ.27కు లభిస్తుంది. తర్వాతి స్థానంలో కువైట్ ఉంది, అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.28గా కొనసాగుతోంది.
పెట్రోల్ ధరల విషయంలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో 73వ స్థానంలో ఉంది. భారత్ ముడిచమురును విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల ఎగుమతి, దిగుమతి సుంకాలు, రాష్ట్రాల ట్యాక్సులు, రవాణా ఛార్జీల కారణంగా పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉంటాయి. చమురు ఉత్పత్తి ఎక్కువగా ఉండే దేశాల్లో ధరలు సహజంగానే తక్కువగా ఉంటాయి. చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే దేశాల్లో ధరలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.