
దేశంలో సంపన్నుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. ఇటీవల విడుదలైన మెర్సిడెస్-బెంజ్ హురున్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025 ప్రకారం.. గత నాలుగేళ్లలో కోటీశ్వరుల కుటుంబాల సంఖ్య దాదాపు 90శాతం పెరిగింది. అంటే గతంలో సంపన్నులుగా ఉన్న వారి సంఖ్య ఇప్పుడు డబుల్ కంటే ఎక్కువగా ఉంది. ఈ నివేదిక ప్రకారం.. రూ.8.5 కోట్ల కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన కుటుంబాల సంఖ్య 4.58 లక్షల నుండి 8.71 లక్షలకు పెరిగింది. ఇప్పుడు దేశంలోని మొత్తం కుటుంబాలలో 0.31శాతం ఫ్యామిలీస్ కోటీశ్వరులుగా ఉన్నాయి. 2017 నుండి 2025 మధ్య కాలంలో ఈ సంఖ్య ఏకంగా 445శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. స్టాక్ మార్కెట్ లాభాలు, కొత్త వ్యాపారాల వృద్ధి, ఆర్థిక పురోగతి ఈ వేగవంతమైన వృద్ధికి ప్రధాన కారణాలు.
రాష్ట్రాల పరంగా చూస్తే.. మహారాష్ట్ర ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ 1,78,000 కంటే ఎక్కువ కుటుంబాలు కోటీశ్వరులు. ముఖ్యంగా ముంబై 1,42,000 కోటీశ్వరుల కుటుంబాలతో దేశ మిలియనీర్ రాజధానిగా మారింది. దీని తర్వాత 79,800 కుటుంబాలతో ఢిల్లీ రెండవ స్థానంలో, 72,600 కుటుంబాలతో తమిళనాడు మూడవ స్థానంలో ఉన్నాయి.
ఢిల్లీ తర్వాత బెంగళూరులో కూడా కోటీశ్వరుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. బెంగళూరులో ఇప్పుడు దాదాపు 31,600 కోటీశ్వరుల కుటుంబాలు ఉన్నాయి. అంతేకాకుండా అహ్మదాబాద్, పూణే, హైదరాబాద్, గురుగ్రామ్ వంటి నగరాలు కూడా ఆర్థిక కేంద్రాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ నగరాలలో కూడా రోజురోజుకూ కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోంది.
హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనాస్ రెహమాన్ జునైద్ మాట్లాడుతూ.. దేశంలో సంపద పెరుగుదల వేగంగా ఉందని తెలిపారు. రాబోయే పదేళ్లలో భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య 1.7 మిలియన్ల నుండి 2 మిలియన్ల వరకు చేరుకోవచ్చని నివేదిక అంచనా వేసింది. అయితే ఈ వృద్ధి ఎక్కువగా మధ్యస్థాయి కోటీశ్వరుల వర్గంలో ఉంటుందని స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..