
భారతీయ రైల్వేలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. తేజస్ లాంటి వేగం, రాజధాని లాంటి సౌకర్యం, వందే భారత్ వంటి అధునాతన సాంకేతికతలు ఇప్పుడు ఒక్క రైలుకే సొంతం అయ్యాయి. అంతటి ప్రత్యేకమైన మొట్టమొదటి వందే భారత్ స్లీపైర్ రైలు ఢిల్లీ-పాట్నా మార్గంలో పరుగులు తీయనుంది. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు డిసెంబర్ చివరి నాటికి పాట్నా, ఢిల్లీ మధ్య కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఈ చారిత్రాత్మక ప్రారంభానికి రైల్వేలు చివరి దశ సన్నాహాలు చేస్తున్నాయి. ప్రయాణీకులు ఆ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బెంగళూరులోని BEML, భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో నిర్మిస్తున్న వందే భారత్ స్లీపర్ రెండు రేక్‌లలో ఒకటి ఇప్పటికే పూర్తయింది. మొదటి రేక్ డిసెంబర్ 12న ఉత్తర రైల్వేకు బయలుదేరుతుంది, ఆ తర్వాత ఢిల్లీ-పాట్నా మార్గంలో ట్రయల్ రన్ జరుగుతుంది. ఈ హైటెక్ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి, వీటిలో 827 బెర్త్‌లు ఉంటాయి, థర్డ్ ఏసీలో 611, సెకండ్ ఏసీలో 188, ఫస్ట్ ఏసీలో 24 బెర్త్‌లు ఉంటాయి.
వందే భారత్ స్లీపర్ రైలును ఆధునిక సౌకర్యాలపై బలమైన దృష్టితో రూపొందించారు. ఇందులో ఆటోమేటిక్ డోర్లు, బయో టాయిలెట్లు, CCTV కెమెరాలు, వ్యక్తిగత రీడింగ్ లైట్లు, ప్రీమియం నాణ్యమైన సౌకర్యవంతమైన ఇంటీరియర్‌లు ఉంటాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో నడిచేలా రూపొందించబడింది. ఇది కవచ్ వ్యవస్థ, క్రాష్ రెసిస్టెంట్ స్ట్రక్చర్ వంటి అధునాతన భద్రతా సాంకేతికతలతో అమర్చబడి ఉంటుంది. అవసరమైతే కోచ్‌ల సంఖ్యను 24కి పెంచవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి