
బుధవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ అమ్మకాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,342 పాయింట్లు క్షీణించి 76,863.71 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 394.75 పాయింట్లు పడిపోయి 23,866.85 వద్ద స్థిరపడింది. బుధవారం సెన్సెక్స్ దాదాపు 11 నెలల కనిష్ట స్థాయి 76,863.71 పాయింట్లకు చేరింది. అంతకుముందు 2025 ఏప్రిల్ 15న ఇది 76,734.89 వద్ద ముగిసింది. అదే విధంగా నిఫ్టీ కూడా 23,866.85 వద్ద ముగిసి దాదాపు 11 నెలల కనిష్టాన్ని నమోదు చేసింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం తర్వాత భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు సుమారు రూ.21.60 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు.
ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సప్లై చైన్ అంతరాయం కలుగుతుందనే భయం. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం వల్ల భారతదేశ ఇంపోర్ట్ బిల్, ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకారం 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.500 పెరిగి రూ.1.61 లక్షలకు చేరుకుంది. అదే సమయంలో ఒక కిలో రూ.సిల్వర్ ధర రూ.2,000 తగ్గి రూ.2.71 లక్షలకు పడిపోయింది.
ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర సుమారు 0.25 శాతం తగ్గి బ్యారెల్‌కు 88 డాలర్ల వద్ద ఉంది. అలాగే డబ్ల్యుటీఐ ఆయిల్ (వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్) ధర బ్యారెల్‌కు 83 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఆసియాలో మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. టోక్యో నిక్కీ 225, 1.4 శాత పెరిగి 55,025.37కు చేరుకుంది. కొరియా కోస్పీ కూడా 1.4 శాతం లాభంతో 5,609.95 వద్ద ఉంది. అయితే హాంగ్ సెంగ్ 0.2 శాతం తగ్గి 25,898.76 వద్ద నిలిచింది. షాంఘై కంపోజిట్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగి 4,133.43 వద్ద ఉంది.
మార్చి 10న అమెరికా మార్కెట్లు స్వల్పంగా తగ్గాయి. డౌ జోన్స్ 34 పాయింట్లు తగ్గి 47,706 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కంపోజిట్ స్వల్పంగా పెరిగి 22,697 వద్ద ఉంది. ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 14 పాయింట్లు తగ్గి 6,781 వద్ద ముగిసింది. మార్చి 10న ఎఫ్‌ఐఐలు సుమారు రూ.4,672 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.6,333 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు. మార్చి నెలలో ఇప్పటివరకు ఎఫ్‌ఐఐలు రూ.32,849 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ.48,134 కోట్ల నికర కొనుగోళ్లు చేశారు. మార్చి 10న మార్కెట్ బుల్లిష్‌గా ఉంది. సెన్సెక్స్ 640 పాయింట్లు పెరిగి 78,205 వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 233 పాయింట్లు లాభపడి 24,262 వద్ద స్థిరపడింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి