Real Estate: భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి భారీగా పెరిగిన ప్రైవేట్‌ ఈక్విటీ వాటా.. ఇది దేనికి సంకేతం..!

|

Dec 25, 2024 | 12:14 PM

భారతదేశం రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌లో దూసుకుపోతోంది. ఈ సంవత్సరం రెసిడెన్షియల్, కమర్షియల్ రంగాల నుండి సానుకూల స్పందన తర్వాత, పెట్టుబడిదారులు ఇప్పుడు ఈ రంగంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతేడాదితో పోల్చితే, వృద్ధి రేటు 2024లో ఎక్కువగా కనిపిస్తోంది. భవిష్యత్తు కూడా రియల్ ఎస్టేట్ రంగానిదే అంటున్నారు నిపుణులు. దేశాభివృద్ధిలో రియల్ ఎస్టేట్ రంగం క్రియాశీలక పాత్ర పోషిస్తుందంటున్నారు నిపుణులు.

Real Estate: భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి భారీగా పెరిగిన ప్రైవేట్‌ ఈక్విటీ వాటా.. ఇది దేనికి సంకేతం..!
Indian Real Estate Sector
Follow us on

భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తోంది. 2047 నాటికి 5.8 ట్రిలియన్‌ అమెరికన్ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారాలన్న భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఈ వృద్ధి నమోదవుతోంది. ఇదే జరిగితే జిడిపికి రియల్ ఎస్టేట్ సహకారం 7.3 శాతం నుంచి 15.5 శాతానికి పెరుగుతుంది. ఈ భారీ విస్తరణ ప్రీమియం, లగ్జరీ హౌసింగ్ విభాగంలో ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం భారతీయ రియల్ ఎస్టేట్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో ఒకటిగా నిలబెడుతోంది.

2024 సంవత్సరంలో రియల్ ఎస్టేట్ రంగంలో బంపర్ వృద్ధిని సాధించింది. 2025లో కూడా విపరీతమైన వృద్ధిని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఈ సంవత్సరం రెసిడెన్షియల్, కమర్షియల్ రంగాల నుండి సానుకూల స్పందన తర్వాత, పెట్టుబడిదారులు ఇప్పుడు ఈ రంగంలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. 2024లో ప్రీమియం, లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ రెసిడెన్షియల్ మార్కెట్‌లో తన వాటాను గణనీయంగా పెంచుకుంది. ఈ సెగ్మెంట్ వాటా 2019లో 6 శాతంగా ఉంది. ఇది ప్రస్తుతం 2024 మొదటి తొమ్మిది నెలల్లో 16 శాతానికి పెరిగింది. “లగ్జరీ హౌసింగ్‌లు, సాంప్రదాయ బంగ్లాల నుండి అపార్ట్‌మెంట్‌లు, పెంట్‌హౌస్‌లకు మారుతున్నాయి. అంటే అదనపు సౌకర్యాలను అందించడం అనేది లగ్జరీ ప్రాజెక్ట్‌ల కోసం ఒక ముఖ్యమైన అంశంగా మారిందంటున్నారు నిపుణులు.

కొల్లియర్స్ ఇండియా నివేదిక ప్రకారం, 2024లో నివాస ప్రాపర్టీల విక్రయాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. సరసమైన వడ్డీ రేట్లు, దేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థ దీనికి ప్రధాన కారణం. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీ ధరలు వార్షికంగా 11 శాతం వరకు పెరిగాయి. దీని ప్రకారం ప్రజలు ఇప్పుడు గృహ విషయాలలో నాణ్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు. అయితే, గృహాల ధరల పెరుగుదల కారణంగా, ఇప్పుడు కొనుగోలుదారులు తమ బడ్జెట్‌ను పెంచుకోవలసి ఉంటుంది. ఇది వారికి భారంగా కానుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు దీని వల్ల ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు నిపుణులు.

CBRE నివేదిక ప్రకారం, 2024 సంవత్సరంలో భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతమైన వృద్ధి నమోదైంది. రియల్ ఎస్టేట్ రంగం సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో మొత్తం 8.9 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులను ఆకర్షించింది. ఇది గత సంవత్సరం కంటే 46 శాతం ఎక్కువ. 2వ శ్రేణి, 3వ శ్రేణి నగరాల్లో ప్రజలలో పెరుగుతున్న ఆసక్తిని బట్టి, కొత్త సంవత్సరం చివరి నాటికి, ఈక్విటీ పెట్టుబడి 10-11 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్ రియల్ ఎస్టేట్‌లో అత్యుత్తమంగా ఉంది. మొత్తం పెట్టుబడిలో 26 శాతం ఇక్కడే జరిగింది. ఆ తర్వాత ముంబై, బెంగళూరులు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ (PE) పెట్టుబడి రెండింతలు పెరిగింది.

భారతదేశంలో, ప్రజలు రియల్ ఎస్టేట్ రంగాన్ని పెట్టుబడికి మంచి ఎంపికగా చూస్తున్నారు. అద్దె ద్వారా డబ్బు సంపాదించడం ద్వారా లేదా మారుతున్న కాలానికి అనుగుణంగా వాటి ధరలను పెంచడం ద్వారా, ఒప్పందం లాభదాయకంగా మారుతుంది. ఈ సంవత్సరం, గురుగ్రామ్, ముంబై వంటి అనేక పెద్ద నగరాల్లో విలాసవంతమైన గృహాలకు అధిక డిమాండ్ కనిపించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, లగ్జరీ విభాగంలో వృద్ధి 2025లో కూడా కొనసాగుతుంది. దీని వెనుక కారణం ప్రజలలో ఎక్కువ ఆర్థిక విశ్వాసం, దేశంలో అధిక నికర విలువ, అల్ట్రా అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య పెరగడం, నగరాల్లో భూమి తగ్గడం ఇందుకు ఉదాహరణ.

వ్యవసాయం తర్వాత, రియల్ ఎస్టేట్ రంగం దేశ జిడిపికి అత్యధికంగా 7.3 శాతం తోడ్పడుతుంది. దీని మార్కెట్ విలువ ప్రస్తుతం 493 బిలియన్ అమెరికన్ డాలర్లు. రాబోయే కాలంలో అభివృద్ధి చెందిన భారతదేశం దృష్ట్యా ఈ రంగంలో విపరీతమైన మార్పులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బహుశా దాని మార్కెట్ విలువ 2034 నాటికి 1.3 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2025 నాటికి జిడిపిలో రియల్ ఎస్టేట్ వాటా 13 శాతానికి పెరగవచ్చంటున్నారు. ముఖ్యంగా లగ్జరీ, అల్ట్రా-లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్‌లో, ద్రవ్యోల్బణం పెరుగుతున్న వడ్డీ రేట్లు సంపన్నుల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి. మధ్య తరగతి ప్రీమియమైజేషన్ వైపు మళ్లడం వలన 2025 తర్వాత కూడా భారతీయ రియల్ ఎస్టేట్ ఒక ముఖ్యమైన ప్రపంచ శక్తిగా మారవచ్చంటున్నారు నిపుణులు. ఇది భారతదేశ ఆర్థిక పురోగతికి కీలకమైన రంగంగా అవరించవచ్చంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్.

(ఇక్కడ అందించిన వార్త సమాచారం కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడి లాభనష్టాలకు లోబడి ఉంటుందని గమనించగలరు.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.