Railways Parcel Management System : కరోనా ప్రభావం రైల్వే శాఖపై కూడా భారీగానే పడింది. రైల్వే ఆదాయం మునుపటి కంటే భారీగా తగ్గింది. దీంతో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయ మార్గాలను అన్వేషించిన రైల్వే శాఖ.. ఆదాయం పెంచుకునేందుకు ఫ్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా పార్శిల్ సేవలను వినియోగదారులకు అనువైన రీతిలో ఆధునికీకరించడం ద్వారా మరిన్ని సేవలను విస్తరించేందుకు నిర్ణయించింది. తద్వారా ఈ ఏడాది రూ.వెయ్యి కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని రైల్వేశాఖ తెలిపింది.
కంప్యూటీకరించిన రైల్వే పార్శిల్ మేనేజ్‌మెంట్ సిస్టం తొలి దశలో 84 స్టేషన్లకు పరిమితం చేయాలని భావిస్తోంది. కాగా, రెండో దశలో 143 స్టేషన్లకు విస్తరించిందని, మూడో దశలో 523 స్టేషన్లకు విస్తరింపజేయనున్నామని రైల్వే శాఖ తెలిపింది. ఇప్పుడు వినియోగదారులు 120 రోజుల ముందుగానే పార్శిల్ స్పేస్ బుక్ చేసుకోవచ్చని రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. దానివల్ల వారు ముందస్తు ప్రణాళికకు అనుగుణంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ సరకును రవాణా చేసుకోవచ్చని పేర్కొంది. ఇప్పుడు ప్రతి కన్సయిన్‌మెంట్‌కు బార్‌కోడింగ్ కేటాయిస్తున్నారు.
ఇకపై, వస్తువు-రకం ఆధారంగా కాకుండా పార్సిల్ ఛార్జింగ్ వాల్యూమ్, బరువు ఆధారంగా మాత్రమే ఉంటుంది. .
భారతీయ రైల్వే పార్శిల్ సేవలు చిన్న సరుకుల రవాణాను అందించడానికి విస్తారమైన స్టేషన్ల ద్వారా ఉపయోగపడనున్నాయి. ఈ సేవలను చిన్న వ్యాపారాలు, ముఖ్యంగా చిన్న నగరాలు, పట్టణాల్లో ఉన్నవారు తమ వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగిస్తారు. పెద్ద నగరాల నుండి ఉత్పత్తి కేంద్రాల నుండి వారి వ్యాపార ప్రదేశానికి వేగంగా, చౌకగా నమ్మదగిన పద్ధతిలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ సేవలను సామాన్యులు గృహనిర్మాణ వస్తువులు, ద్విచక్ర వాహనాలు, ఫర్నిచర్ మొదలైన వాటి రవాణాకు కూడా ఉపయోగిస్తారు.
ఇదిలావుంటే, ఇటీవల రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టికెట్ ధరలను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఆ టికెట్ ధర రూ.10గా ఉంది. రైల్వేశాఖ ఒకేసారి రూ.20 పెంచి ఆ టికెట్ ధరను రూ.30గా నిర్ణయించింది. పెంచిన ధరలను వెంటనే అమల్లోకి తీసుకురావాలని అన్ని జోన్లనూ ఆదేశించింది.మరోవైపు, లోకల్ రైళ్ల టికెట్లను కూడా భారీగా పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లోకల్ రైళ్లలో కనీస చార్జీ రూ.30గా నిర్ణయించారు. దేశంలో కరోనా విజృంభణ పెరిగిపోతోన్న నేపథ్యంలో అనవసర ప్రయాణాలకు అడ్డుకట్ట వేయడానికి చార్జీలను పెంచుతున్నట్లు రైల్వే శాఖ చెప్పుకొచ్చింది.
Read Also… గుజరాత్ అసెంబ్లీలో ‘టీ షర్ట్’ లొల్లి, స్పీకర్ ఆదేశం, కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ నుంచి బయటకి ..