AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైల్లో లోయర్ బెర్త్ కొంతమందికే ఎందుకిస్తారు? మనకు కావాలంటే ఏం చేయాలి?

రైలు టికెట్ బుక్ చేసినా లోయర్ బెర్త్ ఎందుకు రాదో తెలుసా? పార్లమెంట్‌లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక వివరాలు వెల్లడించారు. 60 ఏళ్లు పైబడిన పురుషులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీలు, దివ్యాంగులకు లభ్యత ఆధారంగా లోయర్ బెర్త్‌లలో ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.

రైల్లో లోయర్ బెర్త్ కొంతమందికే ఎందుకిస్తారు? మనకు కావాలంటే ఏం చేయాలి?
Railway Lower Berth
SN Pasha
|

Updated on: Aug 02, 2026 | 3:04 PM

Share

రైలు ప్రయాణాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు లోయర్ బెర్త్‌కే ప్రాధాన్యం ఇస్తుంటారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, గర్భిణీలు, దివ్యాంగులు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం లోయర్ బెర్త్‌ను కోరుకుంటారు. అయితే కన్ఫర్మ్ టికెట్ ఉన్నప్పటికీ చాలామందికి లోయర్ బెర్త్ లభించకపోవడంతో రైల్వే సీట్ల కేటాయింపు విధానంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోయర్ బెర్త్ కేటాయింపు నిబంధనలను వివరించారు.

రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులు, 45 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళలు, అలాగే గర్భిణీ స్త్రీలకు టికెట్ బుకింగ్ సమయంలో లభ్యత ఆధారంగా లోయర్ బెర్త్‌లలో ప్రాధాన్యం ఇస్తారు. అంటే బుకింగ్ సమయంలో లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే, ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) వారికి ముందుగా కేటాయిస్తుంది. అయితే ఇది హామీ కాదని, లోయర్ బెర్త్‌లు అప్పటికే పూర్తిగా బుక్ అయి ఉంటే ఇతర ప్రయాణికుల సీట్లను మార్చి ఇవ్వడం జరగదని రైల్వే స్పష్టం చేసింది.

దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక సౌకర్యాలు అమల్లో ఉన్నాయని రైల్వే మంత్రి తెలిపారు. వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కోటాలో లోయర్ బెర్త్‌లు, ఇతర ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో దివ్యాంగులు ప్రయాణ సమయంలో తక్కువ ఇబ్బందులు ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

రైల్వే నిబంధనల ప్రకారం స్లీపర్ క్లాస్, ఏసీ 3-టైర్ (3A), ఏసీ 2-టైర్ (2A), ఏసీ 3 ఎకానమీ (3E) కోచ్‌లలో కొన్ని లోయర్ బెర్త్‌లను ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీలు, దివ్యాంగుల కోసం రిజర్వ్ చేస్తారు. అయితే ప్రతి కోచ్‌లో లోయర్ బెర్త్‌ల సంఖ్య పరిమితంగా ఉండటంతో అందరికీ ఒకేసారి ఈ సౌకర్యం కల్పించడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు.

టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రయాణికులు లోయర్ బెర్త్ ప్రిఫెరెన్సు అనే ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది కేవలం ఒక ప్రాధాన్యత మాత్రమే. తుది సీటు కేటాయింపు మాత్రం సీట్ల లభ్యత, రైల్వే నిబంధనలు, రిజర్వేషన్ వ్యవస్థ ఆధారంగా స్వయంచాలకంగా జరుగుతుంది. అందువల్ల లోయర్ బెర్త్‌ను ఎంచుకున్న ప్రతి ప్రయాణికుడికి అదే బెర్త్ వస్తుందని భావించకూడదని రైల్వే శాఖ సూచించింది.

ఒకవేళ ప్రయాణికుడికి అప్పర్ లేదా మిడిల్ బెర్త్ కేటాయించబడితే, మరో ప్రయాణికుడు అంగీకరిస్తే పరస్పర సమ్మతితో సీట్లు మార్చుకోవచ్చు. అయితే ఎవరినీ తమ సీటు మార్చాలని రైల్వే అధికారులు బలవంతం చేయరని స్పష్టం చేశారు. రైల్వే శాఖ ప్రకారం, వయోవృద్ధులు, గర్భిణీలు, దివ్యాంగులు వంటి నిజంగా అవసరం ఉన్న ప్రయాణికులకు ప్రాధాన్యం ఇవ్వడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం. అందుకే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలో తమ వివరాలను సరిగ్గా నమోదు చేయాలని, అవసరమైతే లోయర్ బెర్త్ ప్రిఫరెన్స్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించింది. దీంతో నిబంధనలకు అనుగుణంగా లభ్యత ఉన్న మేరకు వారికి లోయర్ బెర్త్ కేటాయించే అవకాశం ఎక్కువగా ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us