రూటు మార్చిన ఇండియన్స్‌! బంగారం, FDలు వదిలి.. వీటిపై భారీగా పెట్టుబడులు!

భారతీయ కుటుంబాల పొదుపు విధానంలో పెద్ద మార్పు కనిపిస్తోంది. బంగారం, ఫిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి మ్యూచువల్ ఫండ్లు, SIPలు, మార్కెట్ ఆధారిత పెట్టుబడుల వైపు ప్రజలు వేగంగా మళ్లుతున్నారని సెబీ తాజా నివేదిక వెల్లడించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

రూటు మార్చిన ఇండియన్స్‌! బంగారం, FDలు వదిలి.. వీటిపై భారీగా పెట్టుబడులు!
Sebi Report

Updated on: May 22, 2026 | 6:19 AM

భారతీయ కుటుంబాల పొదుపు అలవాట్లలో పెద్ద మార్పు కనిపిస్తున్నట్లు సెబీ వెల్లడించింది. ఒకప్పుడు బంగారం, భూములు, ఫిక్స్‌డ్ డిపాజిట్లకే పరిమితమైన పెట్టుబడులు ఇప్పుడు క్రమంగా మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీలు, ఇతర మార్కెట్ ఆధారిత పెట్టుబడుల వైపు మళ్లుతున్నాయని నివేదిక తెలిపింది. సెబీ గణాంకాల ప్రకారం మ్యూచువల్ ఫండ్లలోకి వచ్చే పెట్టుబడులు గత కొన్నేళ్లలో భారీగా పెరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.66 లక్షల కోట్లుగా ఉన్న ప్రాథమిక మార్కెట్ మ్యూచువల్ ఫండ్ ప్రవాహాలు, 2024-25 నాటికి రూ.5.13 లక్షల కోట్లకు చేరాయి. దీనితో SIPలు, మ్యూచువల్ ఫండ్లు అనేక కుటుంబాల నెలవారీ పొదుపు అలవాట్లలో భాగమవుతున్నాయని స్పష్టమవుతోంది.

నివేదిక ప్రకారం 2024-25 నాటికి భారతీయ కుటుంబాలు ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్లు, డెట్ ఉత్పత్తులు, REITలు, InvITలు వంటి మార్కెట్ ఆధారిత ఆస్తుల్లో రూ.141.3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను కలిగి ఉన్నాయి. ఇందులో ఈక్విటీల వాటా ప్రధానంగా ఉండగా, మ్యూచువల్ ఫండ్లలోనే రూ.44.4 లక్షల కోట్ల పెట్టుబడులు నమోదయ్యాయి. ఇప్పటికీ బంగారం, రియల్ ఎస్టేట్ భారతీయుల ప్రధాన పొదుపు సాధనాలుగానే ఉన్నప్పటికీ, ఆర్థిక పెట్టుబడుల ప్రాధాన్యం వేగంగా పెరుగుతోందని సెబీ పేర్కొంది. గృహ పొదుపుల్లో నికర ఆర్థిక పొదుపు వాటా 2022-23లో 27 శాతం ఉండగా, 2024-25 నాటికి అది 33 శాతానికి పెరిగింది.

కోవిడ్ అనంతరం డిజిటల్ పెట్టుబడి యాప్‌లు, సులభమైన KYC ప్రక్రియలు, SIPలపై పెరిగిన అవగాహన కూడా ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. సెక్యూరిటీల మార్కెట్ ద్వారా గృహ పొదుపులు 2022-23లో రూ.2.59 లక్షల కోట్లుగా ఉండగా, 2024-25 నాటికి అవి రూ.6.91 లక్షల కోట్లకు పెరిగాయి. ఈటీఎఫ్‌లు, REITలు, InvITలు, సెకండరీ మార్కెట్ పెట్టుబడులను కూడా తాజా లెక్కల్లో చేర్చడంతో, భారతీయ కుటుంబాల పెట్టుబడి ధోరణిపై మరింత స్పష్టమైన చిత్రం కనిపిస్తున్నట్లు సెబీ తెలిపింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మార్కెట్ పెట్టుబడులు ఇకపై కేవలం అనుభవజ్ఞులకే పరిమితం కాకుండా, సాధారణ కుటుంబాల రోజువారీ పొదుపు అలవాట్లలో భాగమవుతున్నాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us