వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..

Gold: ఒక దేశం ఏడాది మొత్తం కష్టపడి సంపాదించే ఆదాయం కంటే.. ఆ దేశంలోని ఇళ్లలో ఉన్న సంపద విలువే ఎక్కువైతే..? అది అసాధ్యం అనిపిస్తోందా.. కానీ దేశంలో ఇది ఇప్పుడు సుసాధ్యమైంది. ప్రపంచ అగ్రరాజ్యాలే ఆశ్చర్యపోయేలా భారతీయ మహిళల వద్ద ఉన్న పసిడి నిల్వలు ఇప్పుడు ఒక చారిత్రాత్మక రికార్డును తిరగరాశాయి. దేశ GDPని సైతం దాటేసిన ఆ బంగారు రహస్యం ఏంటీ అనేది తెలుసుకుందాం..

వార్నీ.. భారతీయుల దగ్గర ఇంత బంగారం ఉందా.. పసిడి లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..
Indian Household Gold Value

Updated on: Dec 29, 2025 | 3:26 PM

దేశంలో బంగారం అంటే కేవలం ఒక మెటల్ కాదు.. అది ఒక సెంటిమెంట్.. ఒక భద్రత. తరతరాలుగా భారతీయులు కూడబెట్టిన పసిడి సంపద ఇప్పుడు ఒక చారిత్రాత్మక మైలురాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో భారతీయ ఇళ్లలో ఉన్న పసిడి విలువ దేశ మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఉండటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

5 ట్రిలియన్ డాలర్ల మార్క్

ప్రముఖ ఆర్థిక విశ్లేషక సంస్థ మోర్గాన్ స్టాన్లీ అక్టోబర్ నివేదిక ప్రకారం.. భారతీయ కుటుంబాల వద్ద సుమారు 34,600 టన్నుల బంగారం నిల్వ ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సుకు ధర 4,500 డాలర్లు దాటిన నేపథ్యంలో ఈ నిల్వల మొత్తం విలువ 5 ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.4.5 లక్షల కోట్లకు చేరుకుంది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనా ప్రకారం.. భారతదేశ ప్రస్తుత GDP సుమారు 4.1 ట్రిలియన్ డాలర్లు. అంటే దేశం ఏడాది కాలంలో ఉత్పత్తి చేసే ఆదాయం కంటే భారతీయుల ఇళ్లలో ఉన్న బంగారం విలువే ఎక్కువ కావడం విశేషం.

ఎందుకు ఈ పెరుగుదల?

బంగారం ధరలు పెరగడానికి, భారతీయుల ఆసక్తి తగ్గకపోవడానికి ప్రధాన కారణాలు:

ఇవి కూడా చదవండి

సాంస్కృతిక మూలాలు: వివాహాలు, పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేయడం ఒక ఆచారంగా మారింది.

సురక్షిత పెట్టుబడి: షేర్ మార్కెట్ హెచ్చుతగ్గుల మధ్య, కష్టకాలంలో ఆదుకునేది బంగారమేనని సామాన్యుల నమ్మకం.

పెట్టుబడి ధోరణి మార్పు: గతంలో కేవలం ఆభరణాలకే పరిమితమైన పసిడి, ఇప్పుడు కడ్డీలు, నాణేల రూపంలో పెట్టుబడిగా మారుతోంది. 2020లో 23.9శాతంగా ఉన్న పెట్టుబడి వాటా 2025 నాటికి 32శాతానికి చేరుతుందని అంచనా.

సంపద ప్రభావం ఉందా?

బంగారం ధరలు పెరిగినప్పుడు ప్రజలు తాము ధనవంతులం అయ్యామని భావించి.. ఖర్చు చేయడానికి మొగ్గు చూపుతారని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. అయితే ఎమ్కే గ్లోబల్ వంటి సంస్థలు దీనిని భిన్నంగా చూస్తున్నాయి. గత 15 ఏళ్లలో మూడుసార్లు ధరలు భారీగా పెరిగినప్పటికీ అది దేశీయ వినియోగంపై పెద్దగా ప్రభావం చూపలేదని వారి విశ్లేషణ. ప్రపంచ పసిడి వినియోగంలో చైనా (28శాతం) తర్వాత భారత్ (26శాతం) రెండో స్థానంలో ఉంది. ప్రపంచ డిమాండ్‌లో భారత్ వాటా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది.

కేంద్ర బ్యాంకు కూడా పసిడి బాటలోనే..

సామాన్యులే కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన బంగారు నిల్వలను పెంచుకుంటోంది. 2024 నుంచి ఇప్పటివరకు RBI సుమారు 75 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ప్రస్తుతం RBI వద్ద 880 టన్నుల బంగారం ఉంది. ఇది దేశ విదేశీ మారక నిల్వలలో 14 శాతానికి సమానం. భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ పాత తరం నుంచి వస్తున్న పసిడి ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. అటు అలంకారంగా, ఇటు ఆర్థిక భరోసాగా బంగారం భారతీయుల జీవితాల్లో విడదీయలేని భాగంగా ఉందనేది ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి