
ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ JLL తాజా నివేదిక ప్రకారం 2026లో భారతదేశంలో గృహ నిర్మాణ వ్యయాలు 3 నుండి 5 శాతం వరకు పెరగనున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండటం, సుమారు 7.4 శాతం జీడీపీ వృద్ధి నమోదు కావడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్నప్పటికీ, ఈ ఖర్చుల పెరుగుదల సాధారణ కొనుగోలుదారులకు భారంగా మారే అవకాశం ఉంది. నిర్మాణ ఖర్చుల పెరుగుదలలో ప్రధాన కారణం కార్మిక వ్యయాలే. 2025 నవంబర్‌లో అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక చట్టాల ప్రభావంతో వేతనాలు, భత్యాలు పెరగడం జరిగింది. సామాజిక భద్రతా పథకాలు, ఆరోగ్య సదుపాయాలు పెరగడంతో కార్మిక వ్యయాలు 5–12 శాతం వరకు పెరిగాయి. అదే సమయంలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కూడా ఈ ఒత్తిడిని మరింత పెంచుతోంది.
ఇంకొకవైపు నిర్మాణ సామగ్రి ధరల్లో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. సిమెంట్ ధరలు 1–2 శాతం, ఉక్కు ధరలు 3–4 శాతం, డీజిల్ ధరలు 5–6 శాతం వరకు తగ్గాయి. అయితే అల్యూమినియం, రాగి వంటి లోహాల ధరలు 8–10 శాతం పెరగడం మొత్తం ఖర్చును సమతుల్యం చేసే పరిస్థితిని సృష్టించింది. అంటే కొంత ఉపశమనం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఖర్చులు తగ్గడం లేదు. ప్రభుత్వం తీసుకొచ్చిన GST 2.0 విధానం ఈ నేపథ్యంలో కొంత ఊరటనిస్తోంది. సిమెంట్‌పై పన్ను 10 శాతం తగ్గించడం వల్ల బిల్డర్లకు 2–3 శాతం వరకు ఖర్చు ఆదా అవుతోంది. దీని ప్రభావంగా గృహ ధరలు 1–1.5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే నగరాల మధ్య వ్యయాల్లో పెద్ద వ్యత్యాసం కనిపిస్తోంది. ముంబైలో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4,600–రూ.5,200 వరకు ఉండగా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇది రూ.4,200–రూ.4,800 మధ్య ఉంది. దీంతో పెద్ద డెవలపర్లు ఇప్పుడు టైర్-2 నగరాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉండగా ప్రీమియం గృహాల డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. 2023లో సగటు ఇంటి ధర రూ.80 లక్షలు ఉండగా, 2026 నాటికి అది రూ.1.2 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం రూ.2 కోట్లకు పైబడిన గృహాలు మార్కెట్‌లో 45–50 శాతం వాటాను ఆక్రమించడం, కొనుగోలుదారుల అభిరుచిలో మార్పును సూచిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి