Ethanol Blending: ప్రభుత్వ రంగ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) చేసిన నిరంతర ప్రయత్నాల వల్ల ఇది సాధ్యమైంది. నవంబర్ 2022లో నిర్ధేశించుకున్న లక్ష్య తేదీ కంటే 5 నెలలు ముందుగానే 10 శాతం బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకున్నట్లు ఒక అధికారిక ప్రకటన ప్రకారం తెలుస్తోంది. మార్కెటింగ్ కంపెనీలు దేశవ్యాప్తంగా సగటున 10 శాతం ఇథనాల్, 90 శాతం పెట్రోల్ మిక్స్ చేస్తున్నాయి. తద్వారా పెట్రోల్ లో ఇథనాల్ కలపాలనుకున్న లక్ష్యాన్ని భారత్ చేరుకుంది. 2025-26 నాటికి 20% లక్ష్యంగా భారత్ నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరిగిన ‘సేవ్ సాయిల్ మూవ్‌మెంట్’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలకు భారత్ చేసిన సహకారం చాలా తక్కువగా ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం అనేక ప్రయత్నాలు చేస్తోందని వెల్లడించారు. ప్రకృతిని రక్షించడానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఉదహరించారు.
దీనివల్ల రూ.41,500 కోట్లకుపైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలను 27 లక్షల టన్నుల మేర తగ్గాయి. రైతులకు రూ.40,600 కోట్లకు పైగా తక్షణమే చెల్లించినట్లు ప్రకటనలో ఉంది. అమెరికా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, చైనా తర్వాత ప్రపంచంలో ఇథనాల్ ఉత్పత్తిలో భారత్ ఐదవ అతిపెద్ద దేశంగా అవతరించింది.
ఇథనాల్ వినియోగం కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది. అయితే బ్రెజిల్, భారత్ వంటి దేశాలు దానిని పెట్రోల్‌లో కలుపుతున్నాయి. ఇంధన భద్రతను పెంపొందించడానికి, ఇంధనం కోసం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసుకోవటానికి, పర్యావరణ సమస్యలను పరిష్కరించడానికి, దేశీయ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు భారత ప్రభుత్వం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని ప్రకటన పేర్కొంది. రానున్న కాలంలో అవసరాల మేరకు పెట్రోల్ లో మరింత ఇథనాల్ కలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా చేయటం వల్ల దీర్ఘకాలంలో దేశంతో పాటు వాహనదారులకు సైతం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.