భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ట్రెండ్ చేశాయి. ముఖ్యంగా స్కూటర్ల రంగంలో ఈవీ స్కూటర్ల కొనుగోళ్లు తారాస్థాయికు చేరాయి. ఈవీ స్కూటర్లలో సేల్స్‌పరంగా ఓలా స్కూటర్లు దుమ్ముదులిపాయి. ఈవీ స్కూటర్ల అమ్మకాల్లో ఓలా కంపెనీనే టాప్ ప్లేస్‌లో ఉంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఓలా కూడా సర్వీస్ సెంటర్లను పెంచుతూ ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. అయితే ఓ సారి స్కూటర్ కొనుగోలు చేశాక సర్వీస్ విషయంలో ఓలా కస్టమర్లకు చుక్కలు చూపిస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ నెలకు దాదాపు 80,000 ఫిర్యాదులను అందుకుంటుందని ఓ అంచనా. అయితే ఈ ఫిర్యాదులను పరిష్కరించడంలో ఓలా విఫలమవుతుందని కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓలా సర్వీస్ సమస్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఓలా సమస్యలను పరిష్కరించడానికి కొత్త బృందాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. రోజుకు దాదాపు 6,000-7,000 ఫిర్యాదులు పరిష్కరించేలా ఈ బృందం పని చేస్తున్నా సర్వీస్ సమస్యలు మాత్రం పేరుకుపోతున్నాయి. అలాగే పలు గణాంకాల ప్రకారం ఓలా మార్కెట్ 34 శాతం నుంచి 31 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ భారతదేశం అంతటా 430 సర్వీస్ స్టేషన్లను నిర్వహిస్తోంది. రెండు మూడు నెలలుగా, నా స్కూటర్ సర్వీస్ సెంటర్లో పడి ఉందని ఓ వినియోగదారుడు చెబుతున్నాడు. కంపెనీకు లెక్కలేనన్ని ఈ-మెయిల్స్, కాల్స్, మెసేజ్‌లు పంపినా స్పందన లేదని వాపోతున్నారు.
ముఖ్యంగా సర్వీస్ విషయంలో ఓలా చేస్తున్న ఆలస్యంగా చాలా మంది వినియోగదారులు ఎక్స్ ద్వారా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్వీట్స్ ఎప్పటికప్పుడు వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవల ఓ కస్టమర్ ఓలా సర్వీస్ విషయంలో చేస్తున్న జాప్యంతో కర్ణాటకలోని షోరూమ్ మొత్తాన్ని తగలబెట్టాడు. న్యూఢిల్లీలోని మోతీ నగర్‌లో ఉన్న ఓలా సర్వీస్ సెంటర్లు రద్దీగా ఉంటున్నాయి. 500-600 విరిగిన స్కూటర్లు మరమ్మతుల కోసం వేచి ఉన్నాయి. అయితే ముఖ్యంగా సిబ్బంది కొరతతో సమస్య జఠిలమైందని ఓలా ఉద్యోగులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..