ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కమీషన్ పెంపుపై ఇటీవల ఎక్స్ లో పోస్ట్ చేసింది. పెండింగ్ లో ఉన్న వ్యాజ్యం పరిష్కారాన్ని అనుసరించి డీలర్ల మార్జిన్ ను సవరించినందుకు ఆనందంగా ఉందని తెలిపింది. కొత్త కమీషన్ మార్జిన్ 2024 అక్టోబర్ 30 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. దీనివల్ల రిటైల్ విక్రయ ధరపై ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. కస్టమర్ సర్వీసు ప్రమాణాలను, రిటైల్ అవుట్ లెట్ సిబ్బంది సంక్షేమాన్ని పెంచడానికి దోహదపడుతుందని అభిప్రాయ పడింది. అలాగే బీపీపీఎల్, హెచ్ పీసీఎల్ కూడా తమ డీలర్ల కమీషన్ ను పెంచుతున్నట్టు తెలిపారు.
సరకు రవాణాలో అంతరాష్ట్ర హేతుబద్దీకరణ నేపథ్యంలో చమురు సంస్థలు కమీషన్ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీని వల్ల రిటైల్ విక్రయాల్లో వైవిధ్యం తగ్గుతుంది. మోడల్ నియామావళి అమల్లో ఉన్న భౌగోళిక ప్రాంతాలలో మినహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉత్పత్తి ధరలకు విక్రయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. చమురు సంస్థల నిర్ణయాన్ని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్వాగతించారు. మారుమూల ప్రాంతాల్లోని వినియోదారులకు ప్రయోజనం చేకూరేలా ఇంట్రా స్టేట్ సరుకు రవాణా హేతుబద్దీకరణ చేయడాన్ని ప్రశంసించారు. ప్రభుత్వం రంగ సంస్థలు అంతర్రాష్ట్ర టారీఫ్ లను హేతుబద్ధీకరించడంతో కొన్ని ప్రాంతాలలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఒడిశాలో మల్కన్ గిరిలోని కూనన్ పల్లి, కలిమెల లో పెట్రోలు ధర రూ.4.69 నుంచి రూ 4.55 వరకూ, డీజిల్ ధర రూ.4.45 నుంచి రూ.4.32 వరకూ తగ్గనుంది. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్, బైలాడియా, కాటే కల్యాణ్, బచేలి, దంతేవాడలో కూడా ధరలు తగ్గనున్నాయి. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మిజోరాం లలో కూడా తగ్గుదల ఉంటుంది. డీలర్ల కమీషన్ పెంపు వల్ల దేశంలోని ఇంధన అవుట్ లెట్లను ప్రతి రోజూ సందర్శించే సుమారు 7 కోట్ల మంది పౌరులకు మెరుగైన సేవలు అందనున్నాయి. డీలర్లకు కమీషన్ పెంచినా పెట్రోలు ధర పెరగకపోవడం వల్ల వారికి ప్రయోజనం కలుగుతుంది. దేశ వ్యాప్తంగా దాదాపు 83 వేల పెట్రోలు పంపులు నడుపుతున్న డీలర్లు, అలాగే వాటిలో పనిచేస్తున్న దాదాపు పది లక్షల మంది సిబ్బందికి మేలు జరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి