Income Tax: త్వరలో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అందుకే ఇన్‌కమ్ ట్యాక్స్‌కి సంబంధించి ఈ ఐదు పనులని పూర్తి చేస్తే మంచిది. లేదంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందులో మొదటది మార్చి 31, 2022లోపు 2021-22 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ని తప్పనిసరిగా ఫైల్ చేయాలి. సవరించిన ITRని కూడా ఈ తేదీ వరకు ఫైల్ చేయవచ్చు. గడువు ముగిసిన తర్వాత జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలుసుకోండి. అలాగే రెండోది ఆదాయపు పన్నులో మినహాయింపు పొందడానికి మార్చి 31లోపు పెట్టుబడి పెడితే మంచిది. అంటే మీరు పన్ను ఆదా పథకాలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మీకు పన్ను చెల్లింపులో సహాయపడుతుంది. ఇందులో పిపిఎఫ్, సుకన్య సమృద్ధి వంటి చిన్న పొదుపు పథకాలు ఉన్నాయి. మీరు ఎల్‌ఐసి వాయిదా చెల్లించడం ద్వారా కూడా పన్ను ఆదా చేసుకోవచ్చు. ఇతర ప్రయోజనాలను పొందేందుకు కూడా మార్చి 31 చివరి తేదీ.
ఆదాయపు పన్ను చట్టం 208 ప్రకారం రూ.10,000 కంటే ఎక్కువ పన్ను కలిగిన చెల్లింపుదారులు ముందస్తు పన్ను చెల్లించవచ్చు. ఈ ప్రక్రియలో మీరు 4 వాయిదాలలో పన్ను చెల్లించవచ్చు. అలాగే ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయడానికి చివరి తేదీ మార్చి 31. లేదంటే మీ పాన్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది. అప్పుడు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగవు. పన్నులు కూడా కట్టలేరు. భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఇంకా బ్యాంక్ ఖాతా KYC చేయకుంటే ఆర్థిక సంవత్సరం చివరి రోజులోపు కచ్చితంగా చేయండి. కరోనా మహమ్మారి దృష్ట్యా ఈ తేదీని పొడిగించిన సంగతి తెలిసిందే.