దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా డిజిటిలైజ్ అవుతోంది. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతున్నాయి. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలు నగరాల వరకూ అందరూ నగదు రహిత లావాదేవీలు చేస్తున్నారు. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ) అందుబాటులోకి వచ్చాక ఇది మరింత సులభతరం అయ్యింది. దేశ పౌరులందరికీ వివిధ బ్యాంకులకు సంబంధించిన యూపీఐ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రవాస భారతీయ(ఎన్‌ఆర్‌ఐ) వినియోగదారులకు మాత్రం అవకాశం లేదు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకు అయిన ఐసీఐసీఐ తన ఎన్ఆర్ఐ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. యూపీఐ పేమెంట్ సిస్టమ్ ను ఎన్ఆర్ఐ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇప్పుడు ఎన్ఆర్ఐ వినియోగదారులు కూడా తమ మొబైల్ నంబర్ల ద్వారా మన దేశంలో ఇన్ స్టంట్ పేమెంట్స్ అంటే తక్షణ చెల్లింపులు చేయొచ్చని పేర్కొంది. దీని వల్ల రోజువారీ లావాదేవీలు, చెల్లింపులు బాగా పెరుగుతాయని బ్యాంకు అంచనా వేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎన్ఆర్ఐ వినియోగదారులకు యూపీఐ అందుబాటులోకి వచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంకు ఓప్రకటనలో వెల్లడించింది. ఎక్స్ వేదికగా బ్యాంకు అధికారిక పేజీపై దీనికి సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది. ఎన్ఆర్ఐ వినియోగదారులు ఇకపై తమ ఫోన్ నంబర్ తోనే యూపీఐ పేమెంట్లు చేయొచ్చని పేర్కొంది. యుటిలిటీ బిల్లులు, అలాగే ఇ-కామర్స్ లావాదేవీల కోసం భారతదేశంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉన్న వారి ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ బ్యాంక్ ఖాతాతో నమోదు చేసుకున్న వారి మొబైల్ నంబర్‌తో చెల్లింపులు చేయవచ్చని పేర్కొంది. అందుకోసం బ్యాంక్ తన మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఐమొబైల్ పే(iMobile Pay) ద్వారా ఈ సేవను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. అంతకుముందు ఎన్ఆర్ఐ కస్టమర్లు తమ మొబైల్ నంబర్ ను నమోదు చేసుకోవాలని బ్యాంకు సూచించింది యూఎస్ఏ, యూకే, యూఏఈ, కెనడా, సింగపూర్, ఆస్ట్రేలియా, హాంకాంగ్, ఒమన్, ఖతార్ మరియు సౌదీ అరేబియా వంటి 10 దేశాలలో యూపీఐ చెల్లింపులు చేయడానికి ఎన్ఆర్ఐలు వారి బ్యాంక్ ఖాతాలతో భారతీయ మొబైల్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి.
ఐసీఐసీఐ బ్యాంక్ ఎన్ఆర్ఐ కస్టమర్‌లు ఏదైనా భారతీయ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా యూపీఐ చెల్లింపులు చేయవచ్చు. యూపీఐ ఐడీని లేదా ఏదైనా భారతీయ మొబైల్ నంబర్‌కు లేదా భారతీయ బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపవచ్చు. ఈ సదుపాయంతో, 10 దేశాల్లో నివసిస్తున్న తమ ఎన్ఆర్ఐ కస్టమర్‌లు యూపీఐని ఉపయోగించి చెల్లించడానికి భారతీయ మొబైల్ నంబర్‌కు మారాల్సిన అవసరం లేదని ఐసీఐసీఐ బ్యాంక్, డిజిటల్ ఛానెల్స్ అండ్ పార్ట్‌నర్‌షిప్స్ హెడ్ – సిధరత మిశ్రా తెలిపారు. ఈ చొరవతో, బ్యాంక్ ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..