
హైదరాబాద్ నుంచి కేంద్రం మూడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణెకు బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టులను ప్రకటించింది. ప్రస్తుతం అలైన్‌మెంట్, డీపీఆర్, సర్వే దశలో ఇవి ఉన్నాయి. వీటిపై తాజాగా రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశంలో హై-స్పీడ్ కనెక్టివిటీ నెట్‌వర్క్ ద్వారా ఒక పెద్ద మార్పు జరుగుతోందని, దీనికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్‌కు మూడు హై-స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు రానున్నాయని ఆయన తెలిపారు. ఈ మెగా ప్రాజెక్టులు హైదరాబాద్ రూపురేఖలను పూర్తిగా మార్చడమే కాకుండా.. మొత్తం దక్షిణ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలకు కూడా ఒక కీలక మలుపుగా నిరూపించబడతాయని అన్నారు.
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు మూడు హ-స్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లను ఇచ్చారు. ఇవి నగర రూపురేఖలను మార్చేస్తాయి. పుణె నుండి హైదరాబాద్, హైదరాబాద్ నుండి చెన్నై, హైదరాబాద్ నుండి బెంగళూరు వరకు ఉన్న ఈ కారిడార్లు మొత్తం ప్రాంతానికి గేమ్ ఛేంజర్‌గా నిలుస్తాయని అన్నారు. హైదరాబాద్ ఒక హై-స్పీడ్ హబ్‌గా మారుతుందని, ఇది అపారమైన అభివృద్ధిని ప్రేరేపిస్తుందని చెప్పారు. దీని వల్ల మొత్తం ప్రాంత ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా ఏకీకృతం అవుతాయని అన్నారు.
“పూణే-హైదరాబాద్, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్లు దేశంలోని మూడు ప్రధాన పారిశ్రామిక, ఐటీ, వ్యాపార కేంద్రాలకు హైదరాబాద్‌ను నేరుగా అనుసంధానిస్తాయి. వేగవంతమైన కనెక్టివిటీ వల్ల ఈ ప్రాంతం మొత్తం ప్రయోజనం పొందుతుంది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైల్వే అభివృద్ధి కోసం తెలంగాణకు రూ.5,400 కోట్ల భారీ బడ్జెట్‌ను అందిస్తోంది. ఇది ఒక పెద్ద మార్పును తీసుకువస్తోంది” అని అన్నారు. పూణే, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ సమయం ఆదా కావడం వ్యాపారవేత్తలకు, సామాన్యులకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది” అని అన్నారు.