
పీఎఫ్ ఖాతాదారులకు త్వరలో ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్ తెలపనుంది. ఇప్పటివరకు పీఎఫ్ ఖాతాలోని నగదును ఉపసంహరించుకోవాలంటే ఈపీఎఫ్‌వో అధికారిక వెబ్‌సైట్లోకి లాగిన్ అయ్యి ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించాల్సి వచ్చేది. అందుకోసం ఇతర డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. అలా దరఖాస్తు సమర్పించిన తర్వాత ఈపీఎఫ్‌వో అధికారులు పరిశీలించి క్లెయిమ్‌కు ఆమోదం తెలుపుతున్నారు. ఇందుకోసం మూడు లేదా నాలుగు రోజుల పాటు సమయం పడుతుంది. ఈ ప్రక్రియలో డబ్బులు అకౌంట్లో పడాలంటే మూడు లేదా నాలుగు రోజుల సమయం పడుతుంది. ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో నగదు అవసరమైతే పీఎఫ్ ఖాతాదారులకు ఇబ్బంది అవుతుంది.
కానీ ఇక నుంచి పీఎఫ్ ఖాతాదారుల కష్టాలకు తెరపనుంది. కేవలం సెకన్ల వ్యవధిలోనే పీఎఫ్ అకౌంట్లోని నగదును తీసుకోవచ్చు. ఏటీఎం లేదా యూపీఐ యాప్స్ ద్వారా సెకన్లలోనే ఉపసంహరించుకోవచ్చు. దీని వల్ల అత్యవసర సమయంలో డబ్బులు అవసరమైతే పీఎఫ్ ఖాతాదారులకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది. 2026-27 ఆర్ధిక సంవత్సరం ప్రారంభమవుతున్న ఏప్రిల్ నుంచి ఈ సదుపాయం కల్పించనుంది. ఇందుకోసం ఈపీఎఫ్‌వో ఆర్గనైజేషన్ బ్యాక్‌ఎండ్‌లో మార్పులు చేస్తోంది. తొలుత నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న భీమ్ యూపీఐ యాప్‌లో ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకురానుండగా.. ఆ తర్వాత ఫోన్ ఫే, గూగుల్ పే లాంటి ఇతర యూపీఐ ఫ్లాట్‌ఫామ్స్‌లో పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే ఫీచర్ ప్రవేశపెట్టనుంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతాదారులుగా ఉన్నారు. వీరి ద్వారా వచ్చిన సొమ్ముతో దాదాపు రూ.26 లక్షలకుపైగా ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్‌వో నిర్వహిస్తోంది. దీంతో ఖాతాదారులకు ప్రయోజనం చేకూర్చేలా డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు సిద్దమవుతోంది. డిజిటల్ ఇండియలో భాగంగా దేశవ్యాప్తంగా టెక్నాలజీని అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. అన్ని రంగాల్లో టెక్నాలజీని డెవలప్ చేసే ప్రయత్నం చేస్తోంది. అలాగే ప్రజలకు సులువుగా గవర్నెన్స్ అందించేందుకు డిజిటల్ విధానాన్ని ఉపయోగించుకుంటోంది. ఇందుకోసం వెబ్ సైట్, యాప్‌లు రూపొందిస్తోంది. అలాగే ఈపీఎఫ్‌లో కూడా డిజిటల్ విధానాన్ని ప్రవేశపెట్టి ఖాతాదారులకు మరింత వేగంగా సేవలు అందించేలా సిద్దమవుతోంది. అలాగే ఏప్రిల్ నుంచి ఏటీఎం ద్వారా పీఎఫ్ నగదును తీసుకునే అవకాశం కూడా కల్పించనుంది. ఇందుకోసం పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లు, డెబిట్ కార్డులను ఈపీఎఫ్‌వో లింక్ చేయనుంది. దీని వల్ల పీఎఫ్ ఖాతాదారులు ఏటీఎం ద్వారా తమ అకౌంట్లోని డబ్బులు తీసుకోవచ్చు. దీంతో ఇక నుంచి రోజుల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు.