ATM నుంచి మనీ విత్‌డ్రా చేస్తున్నారా? ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ సొమ్ము సేఫ్!

ATM Safety Tips: ఏటీఎం మోసాల పట్ల అవగాహనతో ఉండటం చాలా ముఖ్యం. ఏటీఎంలలో డబ్బు డ్రా చేసుకునే వారు భద్రతాపరంగా చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ బ్యాంక్ ఖాతా, డబ్బు సురక్షితంగా ఉంటాయి. అప్రమత్తంగా ఉండటం ద్వారా సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మీ కష్టార్జితమైన బ్యాంకులోని సొమ్మును కాపాడుకోవచ్చు

ATM నుంచి మనీ విత్‌డ్రా చేస్తున్నారా? ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే మీ సొమ్ము సేఫ్!
ATM Users Alert

Updated on: Jul 17, 2026 | 12:16 PM

డిజిటల్ పేమెంట్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ATMల నుంచి డబ్బు విత్‌డ్రా చేసుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే అత్యవసర పరిస్థితుల్లో నగదు అవసరాలకు ఇప్పటికీ చాలా మంది ATMల ద్వారా డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారు. మరోవైపు ATM మోసాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. కార్డ్ స్కిమ్మింగ్, హిడెన్ కెమెరాలు, ఫిషింగ్ కాల్స్, నకిలీ సహాయం పేరుతో జరిగే మోసాల వల్ల ఎంతో మంది తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. అందుకే ATM ఉపయోగించే సమయంలో కొన్ని కీలకమైన భద్రతా సూచనలు తప్పనిసరిగా పాటించాలి.

1. సురక్షితమైన ATMనే ఎంచుకోండి

ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో లేదా బ్యాంకు బ్రాంచ్‌కు అనుబంధంగా ఉన్న ATMలను ఉపయోగించడం మంచిది. చుట్టుపక్కల ఎవరూ లేని, చీకటిగా ఉన్న నిర్మానుష్య ప్రాంతాలు లేదా అనుమానాస్పదంగా కనిపించే ATMలను వీలైనంత వరకు నివారించండి.

2. ATM కార్డు, PIN వివరాలు ఎవరితోనూ షేర్ చేయకండి

మీ ATM కార్డును ఇతరులకు ఇవ్వకండి. ముఖ్యంగా మీ PIN నంబర్‌ను కుటుంబ సభ్యులు సహా ఎవరికీ వెల్లడించకపోవడం ఉత్తమం. బ్యాంకు అధికారులు కూడా ఎప్పుడూ PIN నంబర్‌ను అడగరు.

ఇవి కూడా చదవండి

3. PIN నమోదు చేసే సమయంలో కీప్యాడ్‌ను కవర్ చేయండి

PIN ఎంటర్ చేస్తున్నప్పుడు మరో చేత్తో కీప్యాడ్‌ను కవర్ చేయండి. దీంతో మీ వెనుక ఉన్నవారు లేదా హిడెన్ కెమెరాలు PINను గుర్తించే అవకాశం ఉండదు.

4. సులభంగా ఊహించే PINలను ఉపయోగించవద్దు

1234, 0000, 1111, పుట్టిన తేదీ, పుట్టిన సంవత్సరం లేదా మొబైల్ నంబర్ చివరి అంకెల వంటి PINలను ఎంచుకోవద్దు. ఇతరులు ఊహించలేని PINను ఉపయోగించండి. అవసరమైతే ప్రతి కొన్ని మాసాలకు ఒకసారి PINను మార్చండి.

5. ATMలో అనుమానాస్పద పరికరాలు ఉన్నాయేమో పరిశీలించండి

కార్డ్ స్లాట్, కీప్యాడ్ లేదా స్క్రీన్ దగ్గర ఏవైనా అదనపు పరికరాలు, చిన్న కెమెరాలు లేదా అసాధారణమైన అమరికలు కనిపిస్తే వెంటనే ఆ ATMను ఉపయోగించకుండా బ్యాంకుకు సమాచారం ఇవ్వండి.

6. లావాదేవీ పూర్తయ్యాక రసీదు, కార్డు తీసుకోవడం మర్చిపోవద్దు

డబ్బులు డ్రా చేసుకున్న తర్వాత మీ ATM కార్డు, నగదు, రిసిప్ట్ అన్నీ తీసుకున్నారో లేదో ఒకసారి నిర్ధారించుకోండి. ఏటీఎంలో మీ లావాదేవీ పూర్తయిన తర్వాత “Cancel” బటన్ నొక్కడం కూడా మంచి అలవాటు.

7. SMS, మొబైల్ బ్యాంకింగ్ అలర్ట్స్‌ను యాక్టివ్‌లో ఉంచండి

మీ అకౌంట్‌లో జరిగే ప్రతి లావాదేవీకి SMS లేదా మొబైల్ యాప్ నోటిఫికేషన్ వచ్చేలా బ్యాంక్ అలర్ట్స్‌ను యాక్టివ్‌లో ఉంచండి. మీరు చేయని లావాదేవీ కనిపిస్తే వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు సమాచారం ఇచ్చి కార్డును బ్లాక్ చేయించండి.

8. అపరిచితుల సహాయాన్ని స్వీకరించవద్దు

ATMలో డబ్బులు తీసే సమయంలో ఎవరైనా సహాయం చేస్తామని ముందుకు వస్తే జాగ్రత్తగా ఉండండి. అపరిచితుల సాయాన్ని స్వీకరించకండి. అవసరమైతే ATM గార్డ్ లేదా నేరుగా బ్యాంక్ సిబ్బంది సహాయం మాత్రమే తీసుకోండి.

9. నకిలీ ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దు

“KYC అప్‌డేట్ చేయాలి”, “మీ ATM కార్డు బ్లాక్ అవుతుంది”, “OTP చెప్పండి” అంటూ వచ్చే ఫోన్ కాల్స్ లేదా మెసేజ్‌లను నమ్మకండి. బ్యాంకులు ఎప్పుడూ PIN, OTP, CVV లేదా పూర్తి కార్డు వివరాలను ఫోన్‌లో అడగవు.

10. ATMలో సమస్య వస్తే వెంటనే బ్యాంక్‌ను సంప్రదించండి

డబ్బులు రాకపోయినా అకౌంట్ నుంచి అమౌంట్ డెబిట్ అయినా, కార్డు ATMలో ఇరుక్కుపోయినా లేదా ఏదైనా అనుమానాస్పద పరిస్థితిని గుర్తిస్తే వెంటనే సంబంధిత బ్యాంక్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయండి.

Follow Us