Car Maintenance: కారు టైర్లు ఎక్కువ కాలం రావాలంటే ఇలా చేయండి!

కారు మెయింటెయిన్ చేసేవారికి కారు టైర్లతో చాలా సమస్యలు వస్తుంటాయి. త్వరగా గ్రిప్ అరిగిపోవడం, మైలేజ్ తగ్గడం.. ఇలా టైర్లతో చాలానే ఇబ్బందులుంటాయి. అయితే కారు టైర్లను సరిగ్గా చూసుకోవడం తెలిస్తే టైర్ల జీవితకాలం పెరగడంతోపాటు కారు పెర్ఫామెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అసలు టైర్ల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలంటే..

Car Maintenance: కారు టైర్లు ఎక్కువ కాలం రావాలంటే ఇలా చేయండి!
Car Maintenance Tyre

Updated on: Oct 14, 2025 | 2:17 PM

కారులో టైర్లు అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కారు పెర్ఫామెన్స్ టైర్లపై కూడా ఆధారపడుతుంది. అలాగే టైర్లు పాడయితే వాటిని మార్చడం కూడా ఖర్చుతో కూడుకున్న విషయం. అయితే ఆటో మొబైల్ నిపుణుల ప్రకారం కారు టైర్లు ఎక్కువకాలం రావాలంటే టైర్ల గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకుని సరిగ్గా మెయింటెయిన్ చేస్తే చాలు. టైర్ల జీవితకాలం రెట్టింపు అవ్వడమే కాకుండా డబ్బు కూడా ఆదా అవుతుంది. కారు సేఫ్టీ కూడా పెరుగుతుంది.

టైర్ ప్రెజర్ ఇలా..

కారు వాడేవాళ్లు ఎప్పటికప్పుడు టైర్ ప్రెజర్ ను చెక్ చేయడం చాలా ముఖ్యం. ప్రతి 10 లేదా15 రోజులకు ఒకసారి టైర్ ప్రెజర్‌ను చెక్ చేస్తుండాలి. గాలి తక్కువగా ఉన్న టైర్లు అంచులలో వేగంగా అరిగిపోతాయి. గాలి మరీ ఎక్కువగా ఉంటే టైరు మధ్య భాగం అరిగిపోతుంది. కాబట్టి సరైన ప్రెజర్ నింపడం ముఖ్యం.

టైర్ రొటేషన్

ప్రతి 10 వేల కిలోమీటర్లకు మీ టైర్ల రొటేట్ చేస్తుండాలి. అంటే ముందు టైర్లు వెనక భాగంలో అమర్చి వెనుక వాటిని ముందు అమర్చాలి. ఇలా టైర్లను మార్చడం వల్ల కారులోని నాలుగు టైర్లు సమానమైన జీవితకాలాన్ని ఇస్తాయి.  స్టీరింగ్ మరియు బ్రేకింగ్ కారణంగా ముందు టైర్లు వేగంగా అరిగిపోతాయి. వాటిని రోటేట్ చేయడం వల్ల  నాలుగు టైర్లకు సమానమైన గ్రిప్ లభించే అవకాశం ఉంటుంది.

వీల్ అలైన్ మెంట్

చాలా కార్లలో నాలుగు టైర్లు భూమికి సమానంగా ఉండవు. దీనివల్ల తెలియకుండానే మీ వాహనం ఒక వైపుకు వంగి ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని సరిచేయడం కోసం ప్రతి 5,000 కిలోమీటర్లకు ఒకసారి వీల్ అలైన్ మెంట్ చెక్ చేయించాలి. దీని వల్ల కారు బ్యాలెన్సింగ్ సరిగ్గా ఉంటుంది. ప్రమాదాల అవకాశం తగ్గుతంది.

టైర్ల నాణ్యత

కారు పెర్ఫామెన్స్ బాగుండాలంటే ఎప్పుడూ  ఒరిజినల్, బ్రాండెడ్ టైర్లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. నకిలీ టైర్లు చౌకగా దొరుకుతాయి. కానీ అవి త్వరగా అరిగిపోవడమే కాకుండా మీ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను తగ్గిస్తాయి.

డ్రైవింగ్ స్టైల్

మీ డ్రైవింగ్ స్టైల్ బట్టి కూడా టైర్లు పాడవుతుంటాయి. వేగంగా వెళ్లడం, సడెన్ బ్రేక్స్ వేయడం వల్ల టైర్లు త్వరగా అరిగిపోతాయి. వాటి గ్రిప్ కూడా తగ్గిపోతుంది. స్లో అండ్ స్టడీగా డ్రైవ్ చేస్తుంటే టైర్లలో మంచి పట్టు ఉంటుంది. కారు పెర్ఫామెన్స్, మైలేజీ కూడా పెరుగుతాయి.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.