
బ్యాంకులలో నిత్యం ఆర్థిక లావాదేవీలు జరుగుతూనే ఉంటాయి. వినియోగదారులు నగదు డిపాజిట్లు, విత్ డ్రాలు, వేరే ఖాతాకు బదిలీలు చేస్తుంటారు. అయితే బ్యాంకు లావాదేవీలకు పాన్ కార్డు కావాలని చాలా మంది చెబుతుంటారు. అయినా కొన్నిసార్లు పాన్‌కార్డు నంబర్ చెప్పకుండానే మన లావాదేవీలు జరుగుతుంటాయి. అసలు బ్యాంకులలో లావాదేవీలకు పాన్ కార్డు అవసరమా, కాదా అనే ప్రశ్న తలెత్తుతుంది.
బ్యాంకులలో లావాదేవీలు నిర్వహించడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. నగదు డిపాజిట్లు చేసినప్పుడు పాన్ కార్డు అవసరమే. కానీ ఎంత మొత్తం చేసినప్పుడు అవసరమవుతుందో తెలుసుకోవాలి. ఈ విషయంపై అవగాహన ఉండడం ప్రతి ఒక్కరికీ అవసరం. బ్యాంకు డిపాజిట్లు చేసేటప్పుడు పాన్ కార్డు అవసరం ఎంత మేరకు ఉంటుందో తెలుసుకుందాం.
పర్మినెంట్ అక్కౌంట్ నంబర్ (పీఏఎన్ కార్డు)ను పాన్ కార్డు అంటారు. ఇది ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. అక్షరాలు, అంకెలు కలిపి దీనిలో పది నంబర్లు ఉంటాయి. ప్రతి ఒక్కరికీ, సంస్థకు ఈ నంబర్ మారుతూ ఉంటుంది. పన్ను ప్రయోజనాల కోసం ప్రధానంగా దీనిని వినియోగిస్తారు. అలాగే ఆర్థిక లావాదేవీలకు కూడా అతి ముఖ్యమైనది.
దేశంలోని వివిధ బ్యాంకులలో నగదును డిపాజిట్ చేసినప్పుడు సాధారణంగా పాన్ కార్డు అవసరం ఉండదు. కానీ ఒకే రోజులో రూ. 50 వేల కంటే ఎక్కువగా డిపాజిట్ చేసిన సమయంలో మాత్రం పాన్ కార్డు నంబర్ తెలపాలి. డిపాజిట్ చేసే నగదు పరిమితి ఎక్కువగా ఉన్నప్పుడు బ్యాంకు సిబ్బంది మన పాన్ కార్డు నంబర్‌ను తప్పనిసరిగా అడుగుతారు. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో మీరు చేసిన నగదు డిపాజిట్లు రూ. 20 లక్షలు దాటినా కూడా పాన్ నంబరును నమోదు చేస్తారు. అంటే మీరు వివిధ బ్యాంకు, పోస్టాఫీసు ఖాతాలలో జమ చేసిన సొమ్ము రూ.20 లక్షలు దాటినా ఈ నిబంధన వర్తిస్తుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) 2022లో ఈ నిబంధన తీసుకువచ్చింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 20 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు లేదా ఉపసంహరణలు జరిపితే పాన్ కార్డు వివరాలు తెలపాలి. అంటే ఆర్థిక సంవత్సరంలో ఒకటి, అంతకంటే ఎక్కువ బ్యాంకు , పోస్టాఫీసు ఖాతాల్లో రూ. 20 లక్షలకు పైగా నగదు డిపాజిట్ చేసినప్పుడు లేదా నగదును విత్ డ్రా చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఇటువంటి లావాదేవీలు చేయడానికి సిద్దమయ్యే వారు ఎవరైనా లావాదేవీ తేదీకి కనీసం ఏడు రోజుల ముందు పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. అలాగే బ్యాంక్, పోస్టాఫీసులో కరెంట్, క్యాష్ క్రెడిట్ ఖాతాను తెరవాలనుకునే వారు తప్పనిసరిగా తమ పాన్ వివరాలను అందించాలి.
ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పాన్ కార్డు అత్యంత అవసరం. మీకు వచ్చే ఆదాయం తదితర వాటిని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆదాయపు పన్ను చెల్లించడానికి, రిటర్న్స్ తీసుకోవాడానికి కూడా చాలా అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..