Bira91 Fall: రాత్రికి రాత్రే రూ. 748 కోట్లు నష్టం.. ఇంతకీ వీళ్లు చేసిన పొరపాటు ఏంటో తెలుసా?
పేరులో ఏముంది?.. అన్నాడు ప్రముఖ నాటక రచయిత షెక్ స్పియర్.. కానీ, భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన బీర్ బ్రాండ్లలో ఒకటైన బిరా 91 (Bira 91) విషయంలో, ఆ పేరే కొంపముంచింది. ఆ పేరులో చేసిన ఒక చిన్న మార్పు ఆ బ్రాండ్‌కు పతనానికి దారితీసింది. పెట్టుబడిదారుడు డి. ముత్తుకృష్ణన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాని ప్రకారం, కంపెనీ వ్యవస్థాపకుడు రాజీనామా చేయవలసిన పరిస్థితిని కల్పించిన ఈ 'విధానపరమైన పొరపాటు' (Procedural Goof-up) ఎలా జరిగింది, దాని పరిణామాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అసలు ఎవరైనా ఊహించగలరా.. కంపెనీ పేరు నుంచి ఓ చిన్న పదాన్ని తొలగిస్తే కోట్లలో నష్టం కలుగుతుందని. ఈ కంపెనీ విషయంలో అలాంటిదే జరిగింది. గత దశాబ్దంలో విజయవంతమైన స్టార్టప్ కథలలో బిరా 91 ఒకటి. క్రాఫ్ట్ బీర్ బ్రాండ్‌గా ఇది వేగంగా అభివృద్ధి చెందింది. అయితే, ఊహించని విధంగా, విధానపరమైన ఒక చిన్న పొరపాటు కారణంగా ఈ కంపెనీ పతనం ప్రారంభమైంది.
పతనం ఇలా ప్రారంభమైంది..
2023 చివర్లో, బి9 బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తన ఐపీఓ (IPO) కోసం సిద్ధమైంది.
లిస్టింగ్ నిబంధనలను పాటించడానికి, కంపెనీ తమ పేరులో ‘ప్రైవేట్’ పదాన్ని తొలగించాలని నిర్ణయించింది. దీనితో కంపెనీ పేరు ‘బి9 బెవరేజెస్ లిమిటెడ్’ గా మారింది.
జనవరి 2024 లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) వద్ద పేరును మార్చారు. కానీ, కంపెనీ ప్యాకేజింగ్, లేబుల్స్, లైసెన్స్‌లు పాత పేరు మీదే ఉన్నాయి.
నియంత్రణల ప్రభావం:
ఈ పేరు మార్పు తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రాలన్నీ కొత్త పేరును వేరే సంస్థగా పరిగణించి, బిరా 91 అమ్మకాలను వెంటనే నిషేధించాయి. కొత్త పేరుతో మళ్లీ చట్టపరమైన అనుమతులు, లేబుల్ అనుమతులు, ఉత్పత్తి నమోదులు, ప్రతి ఒక్క రకానికి కొత్త లైసెన్స్‌లు కావాలని డిమాండ్ చేశాయి.
రాత్రికి రాత్రే పంపిణీ ఆగిపోయింది. కోట్ల విలువైన ఇన్వెంటరీ అమ్ముడుపోకుండా గిడ్డంగుల్లో పేరుకుపోయింది.
2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 824 కోట్ల నుంచి రూ. 638 కోట్లకు తగ్గింది. కంపెనీ రూ. 748 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
తిరిగి పుంజుకోలేక:
బిరా 91 2025 ప్రారంభంలో చాలా రాష్ట్రాల్లో కొత్త అనుమతులు పొంది, ఉత్పత్తిని తిరిగి ప్రారంభించినా, బ్రాండ్ జోరు పూర్తిగా తగ్గిపోయింది. ఐపీఓ ప్రణాళిక నిరవధికంగా వాయిదా పడింది. ఈ కారణాల వలన కంపెనీ ఉద్యోగులు వ్యవస్థాపకుడి రాజీనామాకు ఒత్తిడి చేయాల్సి వచ్చింది.
చెన్నైకి చెందిన పెట్టుబడిదారుడు డి. ముత్తుకృష్ణన్, భారతదేశంలోని నిబంధనల సంక్లిష్టత (Bureaucratic Red Tape) కారణంగానే ఈ బ్రాండ్ పతనమైందని అభిప్రాయపడ్డారు. నిపుణుల సలహా తీసుకోవడం, నిబంధనలను కచ్చితంగా పాటించడం చాలా ముఖ్యమని ఆయన హెచ్చరించారు.




