
వర్షాకాలం రాగానే వాతావరణంలో చల్లదనంతో పాటు తేమ విపరీతంగా పెరిగిపోతుంది. బయట వర్షం పడుతున్నా గదిలో మాత్రం ఉక్కపోతగా, జిడ్డుగా అనిపించడానికి ఈ తేమే కారణం. ఇలాంటి సమయంలో ఏసీ ఆన్ చేసినప్పుడు, అది ముందుగా గాలిలోని జిడ్డుదనానికి కారణమైన తేమను పీల్చుకోవడానికే 40 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఈ వ్యవధిలోనే కంప్రెషర్ నిరంతరం నడుస్తూ విద్యుత్ మీటర్‌ను రాకెట్ వేగంతో తిప్పుతుంది. అయితే వర్షాకాలంలో ఈ తేమ సమస్యను అధిగమించి, కరెంట్ బిల్లును నెలకు రూ.700 నుండి రూ.800 వరకు తగ్గించుకోవడానికి ఒక సులువైన హ్యాక్ అందుబాటులో ఉంది. వర్షాకాలపు ఉక్కపోతను తగ్గించడానికి ఏసీ వేయడానికి ముందే గదిలో ఒక తడి కాటన్ గుడ్డను ఉంచడం ఒక అద్భుతమైన మార్గం. ఇది గదిలోని వేడితో పాటు తేమను కూడా త్వరగా సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. వర్షాకాలంలో ఏసీ కంప్రెషర్ ఉదయం నుండి రాత్రి వరకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఈ చిన్న పద్ధతి ద్వారా కంప్రెషర్ రన్ టైమ్‌ను 10 నిమిషాల నుండి 6 నిమిషాలకు తగ్గించవచ్చు. ఏసీ వినియోగించే మొత్తం కరెంట్‌లో 90శాతం కంప్రెషరే వాడుకుంటుంది కాబట్టి ఈ చిట్కా ద్వారా మీ కరెంట్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది.
ఈ హ్యాక్ ఉపయోగించడానికి ఒక కాటన్ టవల్‌ను నీటిలో నానబెట్టి బాగా పిండి, ఫ్యాన్ కింద ఒక కుర్చీపై లేదా టేబుల్ ఫ్యాన్ ముందు వేలాడదీయాలి. ఏసీ ఆన్ చేసే సమయంలో ఆ గుడ్డను తీసివేయాలి. రాత్రివేళ వర్షం పడుతున్నప్పుడు వాతావరణం కూల్‌గా ఉన్నప్పటికీ గదిలో జిడ్డుగా అనిపిస్తే, కిటికీ గట్టు వద్ద లేదా తలుపు వెనుక చిన్న తడి టవల్ వేలాడదీయడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దీనివల్ల ఏసీని 24 డిగ్రీలో పెట్టినప్పటికీ 22 డిగ్రీల్లో లభించే చల్లదనం అనుభూతికి వస్తుంది. అయితే వర్షాకాలంలో వర్షపు తేమ ఇప్పటికే ఎక్కువగా ఉంటుంది కాబట్టి తడి గుడ్డను ఎట్టిపరిస్థితుల్లోనూ ఏసీ ఇండోర్ యూనిట్ దగ్గర లేదా దాని ముందు ఉంచకూడదు. అలా చేస్తే ఏసీలోని పీసీబీ సర్క్యూట్ షార్ట్ అవ్వడమే కాకుండా కూలింగ్ కాయిల్స్‌పై బూజు పట్టే ప్రమాదం ఉంది. దీనివల్ల అనవసరంగా రూ.3,000 వరకు రిపేర్ ఖర్చు తలపైన పడుతుంది.
దీంతో పాటు వర్షాకాలంలో విద్యుత్ బిల్లును సగం వరకు తగ్గించుకోవడానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏసీని 16 -18 డిగ్రీలలో కాకుండా 24 – 26 డిగ్రీల మధ్య నిర్వహించాలి. ఏసీతో పాటు సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ వేగంతో తిప్పితే చల్లటి గాలి గది అంతటా వేగంగా వ్యాపిస్తుంది. వర్షాకాలపు తేమ గాలి బయట నుండి లోపలికి రాకుండా తలుపులు, కిటికీలను మందపాటి కర్టెన్లతో మూసివేయాలి. ముఖ్యంగా వర్షాకాలంలో గాలిలోని బూజు వల్ల ఫిల్టర్లు త్వరగా మురికిగా మారతాయి కాబట్టి వాటిని తరచుగా శుభ్రం చేయడం ద్వారా 15శాతం వరకు విద్యుత్ వృథాను అరికట్టవచ్చు.