మరికొన్ని రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. పాత ఆర్థిక సంవత్సరం ఆర్థిక క్రమశిక్షణ విషయంలో చేసిన తప్పులను సమీక్షించుకొని కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రమ పద్ధతిలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడం చాలా అవసరం. ముఖ్యంగా పొదుపు పద్ధతులు, పెట్టుబడులు పెట్టే పథకాలు, పన్ను రాయితీలను అందుకొనే విషయాల్లో మరింత శ్రద్ధ అవసరం. ఈ నేపథ్యంలో ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో మీ సంపాదనను వృథా కాకుండా కాపాడుకునేందుకు కొన్ని సూచనలు నిపుణులు చెబుతున్నారు. ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలి? పన్నులను ఎలా సేవ్ చేయాలి అనే విషయాలను వివరిస్తున్నారు. వీటిని ఫాలో అవడం ద్వారా మీరు డబ్బు పొదుపు చేయడంతో పాటు, పన్నులను ఆదా చేసుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం..
బీమా కవరేజీ పెంచుకోండి.. కరోనా సమయం నుంచి ప్రజల్లో ఆరోగ్య బీమా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అకస్మాత్తుగా ఎటువంటి ఆరోగ్య పరిస్థితి ఎదురైనా ఆరోగ్య బీమా ఆదుకుంటుందనే ధీమా జనాల్లో ఏర్పడింది. అయితే తక్కువ ప్రీమియం ఉంటే, దాని ప్రయోజనాలు కూడా తక్కువగానే ఉంటాయి. ఈ కొత్త సంవత్సరంలో మీరు చేయదలచుకుంటే బీమా ప్రీమియాన్ని పెంచుకొని, మరిన్ని సౌకర్యాలను పొందవచ్చు. అలాగే ప్రమాద బీమా అందించే లైఫ్ ఇన్యూరెన్స్ పథకాలను కూడా ప్రారంభించవచ్చు. ఈ బీమాను తీసుకోవడం వల్ల వచ్చే అదనపు ప్రయోజనం పన్ను రాయితీ. ఆదాయ పన్ను చట్టంలోని సెక‌్షన్ 80సీ కింద రూ. 1,50,000 వరకూ పన్ను మినహాయింపును పొందవచ్చు.
ముందస్తుగా పెట్టుబడులు పెట్టండి.. సంవత్సరం ప్రారంభంలో పెట్టుబడులను ప్రారంభించడం వల్ల మూడు ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి బదులుగా చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టవచ్చు, అలాగే మీ డబ్బు పెరగడానికి ఎక్కువ సమయం ఉంటుంది. చివరిగా పన్ను సంబంధిత పెట్టుబడులు యాదృచ్ఛికంగా లక్ష్యాలకు అనుగుణంగా ఉంటాయి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్ స్కీమ్‌లు (ఈఎల్‌ఎస్‌ఎస్) లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (ఎస్‌ఐపీలు) ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచింది. మీరు నెలవారీ ప్రాతిపదికన వీటిలో పెట్టుబడి పెట్టవచ్చు. మీ సంపదను పెంచడానికి బెస్ట్ మార్గాలు ఇవి. అయితే ఇవి మార్కెట్ ఒడిదొడుకులకు లోనవుతాయన్న విషయాన్ని మరచిపోకూడదు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్).. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం మంచి ఎంపిక ఇది. ఈ పథకంపై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం 7.10శాతం ఉంది. దీని లాకిన్ పీరియడ్ 15 ఏళ్లు ఉంటుంది. దీనిలో ఉన్న మరో ప్రయోజనం ఏంటంటే దీనిలో పెట్టుబడి మొత్తంతో పాటు దానిపై వచ్చే వడ్డీకి కూడా పన్ను రాయితీ ఉంటుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్‌పీఎస్).. పదవీ విరమణకు సమయానికి అనుకూలించే బెస్ట్ పథకం ఇది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగుల కోసం తెరిచిన స్వచ్ఛంద పథకం. మీరు సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద రూ. 50,000 వరకు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. అలాగే సెక్షన్ 80సీ కింద రూ. 1,50,000 పరిమితి కంటే ఎక్కువగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..