ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్ లకు మంచి డిమాండ్ ఉంది. అందుకే కంపెనీలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. ఫీచర్లు, రేంజ్ తో పాటు అనువైన బడ్జెట్లో కొత్త మోడళ్లను ప్రవేశపెడుతున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ టూ వీలర్ తయారీదారు ఏథర్ కూడా మార్కెట్లో తనకు పోటీగా ఉన్న ఓలా ఎస్1, టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లకన్న తక్కువ బడ్జెట్లో ఓ స్కూటర్ ను లాంచ్ చేసింది. ఏథర్ 450ఎక్స్ పేరిట తక్కువ ధరకు అందిస్తూనే అదనపు ఫీచర్లు కావాలంటే రూ. 30,000 అదనంగా చెల్లించి ప్రో ఫీచర్లు కలిగిన ఏథర్ 450 ప్రో స్కూటర్ ను పొందవచ్చని క్యాంపెయిన్ మొదలు పెట్టింది. అసలు ఏథర్ 450ఎక్స్, ఏథర్ 450ప్రో స్కూటర్లలో ఉన్న తేడాలు ఏంటి? వాటి అసలు ధరలు ఎంత? అదనంగా అందిస్తున్న ప్రో ఫీచర్లు ఏంటి? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏథర్ నుంచి అందుబాటులో ఉన్న బడ్జెట్ లెవెల్ స్కూటర్ ఏథర్ ప్లస్ ఆ కంపెనీ ఉత్పత్తిని నిలివేసింది. దాని స్థానంలో ఏథర్ 450ఎక్స్, 450 ప్రో అని రెండు మోడళ్లను లాంచ్ చేసింది. 450ఎక్స్ ఇప్పుడు ఆ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్న ఎంట్రీ లెవెల్ మోడల్. దీని ధర రూ.98,183గా ఉంది. అదే విధంగా మరో మోడల్ ఏథర్ 450 ప్రో ధర రూ. 1,28,443గా ఉంది.
ఏథర్ 450 ఎక్స్ వాహనంలో గ్రేస్కేల్ డ్యాష్బోర్డ్ ఉంటుంది. దీనిలో అనేక రకాల ఫంక్షన్లు కనెక్ట్ అయ్యి ఉంటాయి. రెండు మోడళ్లలోనూ ఒకటే ఎల్ఈడీ లైటింగ్, ఆటోమేటిక్ టర్న్ సిగ్నల్స్, బ్లూటూత్, 4జీ కనెక్టివిటీ, వంటి ఫీచర్లు ఉంటాయి. అలాగే ప్రో వెర్షన్ లో హిల్ అసిస్టెంట్, పార్క్ అసిస్టెంట్, వివిధ రకాల రైడింగ్ మోడ్లు ఉంటాయి.
ఏథర్ 450 ఎక్స్, ప్రో మోడళ్లు రెండింటిలోనూ ఒకే సామర్థ్యం కలిగిన బ్యాటరీ ఉంది. 3.7kWh సామర్థ్యంతో ఉన్న ఈ బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 146 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. 450ఎక్స్ స్కూటర్ లోని బ్యాటరీ 80శాతం చార్జ్ అవడానికి 12 గంటల 15 నిమిషాలు పడుతుంది. అదే 100శాతం చార్జ్ అవడానికి 15 గంటల 20 నిమిషాలు సమయం తీసుకుంటుంది. అదే 450 ప్రో వేరియంట్ లో ఫాస్ట్ చార్జింగ్ అవకాశం ఉంది. ఇది నాలుగున్నర గంటల్లోనే 80 శాతం, ఐదున్నర గంటల్లోనే 100 శాతం చార్జింగ్ అవుతుంది. రెండు స్కూటర్లు 3.3 సెకండ్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు.
ఏథర్ కంపెనీ రెండు స్కూటర్లకు మూడేళ్లు లేదా 30,000 మైళ్ల రేంజ్ వరకూ వారంటీని అందిస్తుంది. అదే బ్యాటరీ అయితే 450 ఎక్స్ మోడల్ మూడేళ్లు లేదా 30000 మైళ్లు, 450 ప్రో మోడల్ కు అయితే ఐదేళ్లు లేదా 60,000 కిలోమీటర్ల వరకూ వారంటీ వస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..