
లాంగ్ సమ్మర్ సీజన్ ముగిసింది. జనాలకు వేడి, ఉక్కపోతల నుంచి కాస్త ఉపశమనం లభించింది. రుతుపవనాలు ప్రభావం చూపిస్తుండటంతో అన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం.. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అనారోగ్యాలు చుట్టుముడతాయి. ఇదే సమయంలో రోజూ వర్షాలు పడుతున్న సమయంలో మనం వాడే ద్విచక్ర వాహనాల విషయంలోకూడా అప్రమత్తంగా లేకుంటే వాటి పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వర్షంలో బండి డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో మీరు సురక్షితంగా ప్రయాణించడంతో పాటు మీ బైక్‌ను మెయింటెయిన్ చేయడంలో మీకు సహాయపడే టిప్స్ మీకు అందిస్తున్నాం.
టైర్లను తనిఖీ చేయండి.. వర్షాకాలంలో తడి రోడ్లపై ప్రయాణిస్తారు కాబట్టి మొదటిగా తగినంత గ్రిప్ అందించడానికి మీ వాహనం టైర్‌లను చెక్ చేయండి. జారిపోకుండా అరిగిపోయిన టైర్‌లను మార్చండి.
బ్రేకింగ్ సిస్టమ్.. తడి పరిస్థితులు బ్రేక్ పనితీరును ప్రభావితం చేస్తాయి. కాబట్టి ముంద, వెనుక బ్రేక్‌లు ప్రతిస్పందించేలా ఉండేలా వాటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. సర్వీస్ చేయండి. అలాగే చైన్ ను కూడా లూబ్రికేషన్ చేయించాలి. ఇది తడిస్తే తుప్పు పడుతుంది. కాబట్టి మంచి స్థితిలో ఉంచడానికి నీటి-నిరోధక కలిగిన చైన్ లూబ్రికెంట్‌ని వాడటం మంచిది.
బ్యాటరీ పరిస్థితి.. మీ బ్యాటరీ పూర్తిగా చార్జ్ చేసి, మంచి స్థితిలో ఉందని నిర్ధారించుకోండి. ఎందుకంటే తడి వాతావరణం విద్యుత్ భాగాలపై బాగా ప్రభావం చూపుతుంది. విజిబిలిటీ చక్కగా ఉండాలంటే బ్యాటరీ ఫుల్ గా ఉండాలి. ఏదైనా బల్బులు పోయినా వెంటనే భర్తీ చేసుకోవాలి.
సురక్షితమైన రైడింగ్ కోసం.. తడిగా ఉన్న పరిస్థితుల్లో సురక్షితంగా రైడ్ చేయడానికి ఓవర్‌స్పీడ్‌ను నివారించండి. ఎందుకంటే తక్కువ వేగం స్కిడ్డింగ్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే, సడన్ గా వేగం పెంచడం, బ్రేకింగ్, పదునైన మలుపులను నివారించండి. జారే పరిస్థితుల్లో మీ మోటార్‌సైకిల్‌పై నియంత్రణను కొనసాగించడంలో ఇది మీకు సహాయం చేస్తుంది. అంతే కాకుండా, ఇతర వాహనాల నుంచి ఎల్లప్పుడూ సురక్షితమైన దూరం పాటించండి. రోడ్లపై నీళ్లు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అక్కడ గుంతలుండే అవకాశం ఉంటుంది. వర్షంలో, బురదలో వెళ్లిన తర్వాత బండిని కడగడం అవసరం. చైన్, బ్రేక్‌లు, ఎలక్ట్రికల్ భాగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, తేమను తొలగించడానికి గుడ్డ లేదా ఎయిర్ బ్లోవర్‌ని ఉపయోగించి మీ బైక్‌ను పూర్తిగా ఆరబెట్టండి. చైన్, బ్రేకులు వంటి ప్రాంతాలలో మళ్లీ లూబ్రికెంట్ చేయండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..