GST: గుడ్ న్యూస్.. తగ్గనున్న కార్ల ధరలు.. ఎంత తగ్గుతాయంటే..?

కారు కొనడం.. ప్రతి ఒక్కరి కల. కానీ బడ్జెట్ పరంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కు కొంచెం కష్టం. ప్రస్తుతం కార్లపై 28శాతం జీఎస్టీ ఉంది. అయితే త్వరలోనే ప్రజలకు కొన్నింటిపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తామని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కార్లపై జీఎస్టీ తగ్గిస్తే ఎంత రేటు తగ్గుతుందో తెలుసా..?

GST: గుడ్ న్యూస్.. తగ్గనున్న కార్ల ధరలు.. ఎంత తగ్గుతాయంటే..?
Gst On Cars

Updated on: Aug 20, 2025 | 6:10 AM

స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోదీ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే కొన్ని వస్తవులపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సారి ప్రజలు డబుల్ దీపావళి చేసుకుంటారని అన్నారు. ఈ క్రమంలో ఏ వస్తువులపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తారా అని చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అయితే దేశంలో వాహనాలపై జీఎస్టీ తగ్గిస్తే.. ముఖ్యంగా చిన్న కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయని హెచ్ఎస్‌బీసీ ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది. ఇది ఆటోమొబైల్ పరిశ్రమకు ఊతమివ్వడమే కాకుండా, సామాన్య ప్రజలకు కార్లను మరింత అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం చిన్న కార్లపై ఉన్న 28శాతం జీఎస్టీ రేటును 18శాతానికి తగ్గిస్తే, వినియోగదారులకు ఈ వాహనాల ధరలలో సుమారు 8శాతం తగ్గుదల ఉంటుందని నివేదిక సూచిస్తుంది. ఇదేవిధంగా పెద్ద కార్ల ధరలు కూడా 3శాతం నుంచి 5శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మార్పుల వల్ల మధ్యతరగతి ప్రజలకు కారు కొనుగోలు మరింత సులభమవుతుంది. తద్వారా అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.

జీఎస్టీని అన్ని వాహన వర్గాలలో 28శాతం నుంచి 18శాతానికి తగ్గిస్తే, అన్ని కార్ల ధరలు 6శాతం నుంచి 8శాతం వరకు తగ్గుతాయి. అయితే ఈ పన్ను తగ్గింపు వల్ల ప్రభుత్వం 5 బిలియన్ల డాలర్ల నుంచి 6 బిలియన్ల వరకు ఆదాయం కోల్పోవచ్చని అంచనా వేసింది. అయినప్పటికీ కార్ల అమ్మకాలు పెరగడం వల్ల వచ్చే ఆర్థిక వృద్ధి ఈ నష్టాన్ని కొంతవరకు భర్తీ చేయగలదని నివేదిక పేర్కొంది.

ప్రస్తుత పన్ను నిర్మాణం

ప్రస్తుతం ప్రయాణీకుల వాహనాలపై వాహనం బట్టి 29శాతం నుండి 50శాతం వరకు పన్నులు, అదనపు సెస్ విధించబడుతున్నాయి.

చిన్న పెట్రోల్ కార్లు (1200cc లోపు, 4 మీటర్ల లోపు): 28శాతం జీఎస్టీ + 1శాతం సెస్

చిన్న డీజిల్ కార్లు (1500cc లోపు, 4 మీటర్ల లోపు): 28శాతం జీఎస్టీ + 3శాతం సెస్

మధ్య తరహా కార్లు: 43శాతం అధిక పన్ను

లగ్జరీ కార్లు: 48శాతం పన్ను

SUVలు: 50శాతం వరకు అత్యధిక పన్ను

ఎలక్ట్రిక్ వాహనాలు : 5శాతం జీఎస్టీ

ప్రతిపాదిత పన్ను విధానం

ఈ క్రమంలో హెచ్ఎస్‌బీసీ నివేదిక ఒక కొత్త పన్ను విధానాన్ని కూడా సూచించింది. దీని ప్రకారం, చిన్న కార్లపై తగ్గించిన 18శాతం రేటు విధించి, అదే సమయంలో పెద్ద వాహనాలపై 40శాతం ప్రత్యేక రేటు విధించవచ్చు. ఈ విధానంలో ప్రస్తుత అదనపు సెస్‌ను రద్దు చేయాలని ప్రతిపాదించింది. ఈ మార్పు వల్ల వాహనం పరిమాణం, రకానికి అనుగుణంగా పన్ను విధానం రూపొందించబడుతుంది. ఇది మార్కెట్‌లో సమతుల్య వృద్ధికి దోహదం చేస్తుంది.

కాగా పాత పన్ను విధానంతో పోలిస్తే, జీఎస్టీ అమలు తర్వాత చిన్న కార్లు, లగ్జరీ కార్ల ధరలపై పన్ను భారం తగ్గింది. అయితే మధ్య తరహా కార్లు కొంచెం ఖరీదైనవిగా మారాయి, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు మాత్రం గణనీయంగా తగ్గాయి. ఈ పన్ను విధానం మార్కెట్‌లో వినియోగదారుల ఎంపికలను మార్చిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..