
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎలోన్ మస్క్ తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం టెస్లా కంపెనీ ముంబై, పూణే కేంద్రాలుగా ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెస్లా కంపెనీ కార్ల అమ్మకాలు మన దేశంలో ముందుగా మొదలవుతాయి. దీని కోసం ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన ఆ కంపెనీ కార్లను దిగుమతి చేసుకుంటారు. అనంతరం స్థానికంగా కార్ల తయారీని ప్రారంభిస్తారు. అయితే చైనా నుంచి టెస్లా కార్లను దిగుమతి చేసుకునే విషయంపై మన దేశం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జర్మనీ నుంచి ఆ కార్లను దిగుమతి చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
భారత ప్రభుత్వం 2024లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని ప్రకటించింది. దాని కింద వివిధ రకాల పన్ను ప్రయోజనాలను కల్పిస్తోంది. వాటికి దరఖాస్తు చసుకోవాలని టెస్లా కంపెనీ భావిస్తోంది. స్థానికంగా కర్మాగారం కోసం 500 మిలియన్ల డార్లు పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉంటే, వాహన తయారీదారుడు ఏటా 8 వేల కార్లను 15 శాతం కస్టమ్స్ సుంకం రేటుతో దిగుమతి చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఎలోన్ మస్క్ కంపెనీ పెట్టుబడులను ఆకర్షించడానికి అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. కార్ల యూనిట్ ను తమ రాష్ట్రంలో పెట్టాలని కోరుతున్నాయి. దాని కోసం వివిధ రాయితీలను కూడా ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ముందంజలో ఉన్నాయి.
చైనాతో ఉన్న దౌత్యపరమైన సమస్యల కారణంగా అక్కడి నుంచి కార్లను దిగుమతి చేసుకోకూడదన్న భారత్ డిమాండ్ పై ఎలోన్ మస్క్ సానుకూలంగా స్పందించారు. జర్మనీ నుంచి దిగుమతి చేసుకోవడానికి అంగీకరించారు. ప్రస్తుతం బెర్లిన్ లోని ఓ కంపెనీలో టెస్లా మోడల్ వై కార్లు ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పుడు అక్కడ మన దేశానికి దిగుమతి చేసుకోనున్న కార్లను తయారు చేస్తారు. ఇక్కడి అలవాటుకు అనుగుణంగా కుడిచేతి స్టీరింగ్ కార్లను తయారు చేయనున్నారు. ముంబైలోని బీకేసీ వ్యాపార జిల్లాలో, న్యూఢిల్లీలోని ఏరోసిటీలో టెస్లా తన షోరూమ్ లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ లోనే రిటైల్ విక్రయాలు ప్రారంభించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో ముంబై, పూణే కేంద్రాలుగా అనేక ఉద్యోగాలకు అభ్యర్థులను కోరుతూ టెస్లా లింక్డ్ ఇన్ లో ప్రకటనలను పోస్టు చేసింది. దీంతో టెస్లా ఎంట్రీకి రంగం సిద్దమైనట్టు తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి