2021-2022 ఆర్థిక సంవత్సరం చివరి నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూల్ అయింది. మార్చిలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(GST) రూ.1.42 లక్షల కోట్లు వచ్చింది. కొత్త పన్ను విధానం అమలులోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో పన్ను వసూల్ కావడం ఇదే తొలిసారి. జనవరి 2022 నెలలో రూ.1,40,986 కోట్లు వచ్చాయి. గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ ఆదాయాల కంటే ఈ మార్చిలో వచ్చిన ఆదాయాలు 15% ఎక్కువ. మార్చి 2020లో వచ్చిన జీఎస్టీ రాబడి కంటే 46% ఎక్కువగా ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఓమిక్రాన్ భయాలతో ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లు రూ. 1,33,026 కోట్లుగా ఉన్నాయి. ఈ మొత్తం వసూళ్లలో CGST రూ.25,830 కోట్లు, SGST రూ.32,378 కోట్లు, IGST రూ.74,470 కోట్లు,సెస్ రూ.9,417 కోట్లుగా ఉన్నాయి. అధికారిక ప్రకటన ప్రకారం చివరి త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల GST వసూళ్లు రూ.1.38 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఆర్థిక పునరుద్ధరణ, ఎగవేత నిరోధక కార్యకలాపాలు, ప్రత్యేకించి నకిలీ బిల్లర్లపై చర్యలు అధిక GST వసూళ్లకు దోహదం చేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇన్‌వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిచేయడానికి కౌన్సిల్ చేపట్టిన వివిధ రేట్ల హేతుబద్ధీకరణ చర్యల వల్ల కూడా ఆదాయం మెరుగుపడిందని అభ్రిపాయపడింది. ప్రభుత్వం సాధారణ సెటిల్‌మెంట్‌గా CGSTకి రూ.29,816 కోట్లు, SGSTకి రూ.25,032 కోట్లు చెల్లించింది. అదనంగా ఈ నెలలో కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య 50:50 నిష్పత్తిలో తాత్కాలిక ప్రాతిపదికన రూ.20,000 కోట్ల IGSTని సెటిల్ చేసింది.
Read Also.. Adani Wilmar: లాభాలు తెచ్చిపెడుతున్న అదానీ విల్మార్.. వారంలో 30 శాతం పెరిగిన స్టాక్..