మనం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నాం. అన్నిరంగాల్లోనూ ఏఐ ప్రవేశం ఇప్పుడు ఉద్యోగుల పాలిట సంకటంగా మారింది. ఈ కృత్రిమమేథ రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’కి పోటీగా సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కొత్త ఆవిష్కరణ చేసింది. గత ఆరేళ్లుగా ఏఐపై కృషి చేస్తున్న ఈ కంపెనీ ఎట్టకేలకు ‘బార్డ్’ను ప్రవేశపెట్టింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ బ్లాగ్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. బార్డ్ అంటే ఏమిటి?, దీని పనితీరుని ఆయన తెలిపారు. బార్డ్ అనేది ఒక ప్రయోగాత్మక సంభాషణపరమైన ఏఐ సర్వీసని, కంపెనీ లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ ఆధారంగా పనిచేస్తుందని తెలిపారు.
చాట్‌జీపీటీ, బార్డ్ మధ్య వ్యత్యాసం ఏంటంటే.. ‘బార్డ్’ వెబ్ నుంచి సమాచారాన్ని పొందగలదు. సాధ్యమైనంత ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. వెబ్ నుంచి అధిక నాణ్యత కలిగిన సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా బార్డ్‌ను డిజైన్ చేసినట్టు సుందర్ పిచాయ్ వెల్లడించారు. పిల్లలు సైన్స్‌కు సంబంధించిన సంక్లిష్టమైన అంశాలను కూడా దీని ద్వారా సులభంగా నేర్చుకోవచ్చునని చెప్పారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి బెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్ వరకు ఎవరైనా తెలుసుకోవచ్చని వివరించారు.
ప్రస్తుతానికి దీనిని కొంతమందికి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రయోగాత్మకం పరిశీలిన తర్వాత ఏడాదిలోపే విస్తృతంగా అందుబాటులో తీసుకొస్తామన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..