గతేడాది ప్రపంచాన్ని భయపెట్టిన ఉద్యోగాల తొలగింపు మరోసారి అలజడిని రేపుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఉద్యోగుల తొలగింపు అంశం చర్చనీయాశంగా మారింది. తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ భారీగా ఉద్యోగులను తొలగించినట్లు వస్తున్న వార్త మరోసారి ఉద్యోగులను కలవరపెడుతోంది. ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఏకంగా 1000 మందిని విధుల నుంచి తొలగించింది. గూగుల్ సైతం ఈ వార్తలను అంగీకరించినట్లు సమాచారం.
గూగుల్ హార్డ్‌వేర్, సెంట్రల్ ఇంజనీరింగ్ టీమ్‌లు, గూగుల్ అసిస్టెంట్ సహా పలు విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ విషయమై గూగుల్ తమ ఉద్యోగులకు మెయిల్స్ పంపించినట్లు సమాచారం. ఉద్యోగాల తొలగింపు గురించి ముందస్తు సమాచారం ఇవ్వలేకపోయినందుకు చింతిస్తున్నామని, సంక్లిష్ట నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఉద్యోగులకు పంపించిన ఈ మెయిల్‌లో కంపెనీ పేర్కోనడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఉద్యోగం కోల్పోయిన వారిలో అర్హులైన వారికి పరిహార ప్యాకేజ్ అందిస్తామని గూగుల్ చెప్పుకొచ్చింది. ఇతర విభాగాల్లో ఏవైనా ఖాళీలు ఉంటే ఉద్యోగం కోల్పోయిన వారు వాటికి అప్లై చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. అయితే కంపనీలో తిరిగి అవకాశం లభించని ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్‌లో కంపెనీని వీడాలని గూగుల్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే గూగుల్ ఉద్యోగులను ఇంటికి సాగనంపడం ఇదే తొలిసారి కాదు.
గతేడాది కూడా గూగుల్ భారీగా ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గూగుల్‌లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 6 శాతం మందిపై ప్రభావం పడింది. ఇదిలా ఉంటే ఉద్యోగుల తొలగింపు కేవలం గూగుల్‌కు మాత్రమే పరిమతం కాకుండా ఇతర కంపెనీలు కూడా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఈ నెల 15వ తేదీ నాటికి 48 టెక్ కంపెనీలే ఏకంగా 7528 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు లే-ఆఫ్ ట్రాకింగ్ వెబ్ సైట్ లే-ఆప్స్.ఎఫ్‌వైఐ ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..