New Wage Code: ప్రభుత్వం త్వరలో కొత్త వేతన కోడ్‌ని అమలు చేయనుంది. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచే దీనిని అమలు చేయడానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు. తర్వాత అక్టోబర్‌లో ప్రారంభించాలనుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాల వల్ల అది అమలు కాలేదు. ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వేతన నియమావళికి సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ అన్ని రంగాల హెచ్‌ఆర్ హెడ్‌లతో చర్చిస్తోంది. 26 రాష్ట్రాలు వేతన కోడ్‌పై నిబంధనలను నోటిఫై చేశాయని లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ప్రభుత్వం అన్ని పనులను ఏకగ్రీవంగా, పారదర్శకంగా చేస్తుందన్నారు.
కొత్త వేతన కోడ్ ప్రకారం.. ఉద్యోగుల ఎర్న్డ్ లీవ్స్‌ని 240 నుంచి 300కి పెంచే అవకాశం ఉంది. లేబర్ కోడ్ నియమాలలో మార్పులకు సంబంధించి కార్మిక మంత్రిత్వ శాఖ, లేబర్ యూనియన్, పరిశ్రమ ప్రతినిధుల మధ్య చాలాసార్లు చర్చలు జరిగాయి. కొత్త వేతన కోడ్ ప్రకారం.. ఉద్యోగుల జీతంలో మార్పులు ఉంటాయి. వారి టేక్ హోమ్ జీతం తగ్గుతుంది. ఎందుకంటే వేజ్ కోడ్ చట్టం, 2019 ప్రకారం ఉద్యోగి బేసిక్ జీతం కంపెనీ (CTC) ఖర్చులో 50% కంటే తక్కువ ఉండకూడదు. ప్రస్తుతం చాలా కంపెనీలు బేసిక్ శాలరీ తగ్గించి పై నుంచి ఎక్కువ అలవెన్సులు ఇవ్వడం వల్ల కంపెనీపై భారం తగ్గించుకుంటున్నాయి.
ఇప్పుడు కొత్త వేతన కోడ్ ప్రకారం అలవెన్సులు మొత్తం జీతంలో 50% మించకూడదని నిర్ణయించారు. ఈ పరిస్థితిలో ఒక ఉద్యోగి జీతం నెలకు రూ. 50,000 అయితే అతని బేసిక్ వేతనం రూ. 25,000 అవుతుంది. అతని అలవెన్సులు మిగిలిన రూ. 25,000లో రావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు బేసిక్ జీతం 25-30 శాతంగా ఉంచి, మిగిలిన భాగాన్ని అలవెన్స్‌లో ఉంచిన కంపెనీలు ఇకపై బేసిక్ జీతం 50 శాతం కంటే తక్కువగా ఉంచలేవు. కొత్త వేతన కోడ్ నిబంధనలను అమలు చేయడానికి కంపెనీలు చాలా అలవెన్సులను తగ్గించవలసి ఉంటుంది. అంతేకాదు పనిగంటలు పెరుగుతాయి. దాంతో పాటు వీక్లీ ఆఫ్ కూడా పెరిగే అవకాశం ఉంది.