
2026 ప్రారంభంలో ఆల్ టైం రికార్డు సృష్టించిన బంగారం ధరలు.. ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతూ వస్తోన్నాయి. గత కొద్ది నెలలుగా పసిడి ధరలు దిగొస్తూ వస్తోన్నాయి. 2026 జనవరిలో ఔన్సుకు 5,595 డాలర్లకు చేరుకుని జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఆ తర్వాత ప్రపంచ మార్కెట్లలో బంగారం ధర కుప్పకూలుతూ వస్తూండగా.. ఇప్పటికే సుమారు 27 శాతం పడిపోయింది. అయితే గోల్డ్ రేట్లు మరింతగా తగ్గే అవకాశముందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో 16 శాతం వరకు కుప్పకూలే ఛాన్స్ ఉందని అంటున్నారు. 3,400 డాలర్ల నుండి 3,500 డాలర్ల వరకు డౌన్ అవ్వొచ్చని చెబుతున్నారు. దీని ప్రకారం చూస్తే భారత్‌లో కూడా బంగారం ధరలు రూ.20 వేల వరకు తగ్గే అవకాశం ఉంది.
బంగారం ధర గత కొద్ది నెలలుగా క్రాష్ అవుతూ వస్తోంది. దీంతో రానున్న నెలల్లో కూడా మరింత తగ్గే ఛాన్స్ ఉన్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కమోడిటీ రీసెర్చ్ హెడ్ హరీష్ వి ఓ బీఎస్ నివేదికలో వెల్లడించారు. గత రెండు సంవత్సరాల్లో బంగారం ధరలు దాదాపు రెట్టింపు అవ్వడంతో సాంకేతిక దిద్దుబాటు జరిగే అవకాశం ఉందని అన్నారు. ర్యాలీ తదుపరి దశకు ముందు ధరలు 3,400,3,500 డాలర్ల వద్ద ఉండవచ్చని అంచనా వేశారు. దీని ప్రకారం చూస్తే భారత మార్కెట్లలో బంగారం ధరలు రూ.1.22 లక్షలకు తగ్గొచ్చని అంటున్నారు. ప్రస్తుతం తులం బంగారం రూ.1.43 లక్షలుగా ఉండగా.. మరో రూ.20 వేలు తగ్గే అవకాశమున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
ఈ సంవత్సరం బంగారం ధరల పతనానికి అమెరికా-ఇరాన్ మధ్య యుద్దమే కారణమని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పెట్టుబడిదారులు రెండు రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నారు.పెరుగుతున్న ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ఆందోళనలను పెంచింది. ఇక ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం, బలమైన అమెరికన్ డాలర్ వంటి పరిణామాల వల్ల ఇతర కరెన్సీలు ఉన్న కొనుగోలుదారులకు బంగారం ఆకర్షణను తగ్గిస్తుంది. కేవలం ఫిబ్రవరి నెలాఖరు నుంచే అంతర్జాతీయ బంగారం ధరలు 23 శాతం పడిపోయాయి. యుద్దం ఇలాగే కొనసాగితే ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి.. ఎప్పుడు పెరుగుతాయి అనేది ఎవరూ చెప్పలేరు. అంతర్జాతీయ పరిస్థితులు, రాజకీయ అనిశ్చితిని బట్టి ధరలు ప్రభావితం అవుతూ ఉంటాయి. దీంతో బంగారంలో ఇన్వెస్ట్ చేసేవారు అన్నీ ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి.