పసిడి ధరలు పడిపోతున్నాయి. స్టాక్‌మార్కెట్ బేర్‌మంటుంటే.. బంగారం ధర తగ్గిపోతోంది. అతివలను రారమ్మని పిలుస్తోంది బులియన్ మార్కెట్. ఐదురోజులుగా వరుసగా తగ్గుతూనే ఉంది బంగారం ధర. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర 76వేల 850 రూపాయలకు దిగొచ్చింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు 70వేల 450 రూపాయలకు తగ్గింది. నాలుగురోజుల్లోనే 10గ్రాములపై దాదాపు 3వేల రూపాయలు తగ్గిందంటే కలయా నిజమా అని గిల్లుచూసుకుంటున్నారు పసిడిప్రియులు. ఓ దశలో 82వేల రూపాయలకు ఎగువన ఆల్‌టైం రికార్డ్‌ని నమోదుచేసిన పసిడి.. పెరుగుట విరుగుట కొరకేనన్నట్లు కొండ దిగొస్తోంది.
దేశీయ బులియన్ మార్కెట్‌లో వరుసగా ఐదోరోజు బంగారం ధరలు తగ్గాయి. ఇంత సడెన్‌గా పసిడి ఎందుకంతలా తగ్గుతోందంటే.. అంతా ట్రంప్‌కి థాంక్స్ చెప్పాలి. అవును ఆయనగారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాకే ప్రపంచమంతా పసిడి టెక్కు తగ్గింది. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి ఇంకా సమయమున్నా.. ట్రంప్ గెలుపుతో ప్రపంచ మార్కెట్ ప్రభావితమవుతోంది. అప్పటిదాకా ముట్టుకోలేరన్నట్లు మురిపించిన బంగారం ధర.. నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఇన్వెస్టర్లు బంగారంనుంచి తమ పెట్టుబడులను స్టాక్‌మార్కెట్‌తో పాటు ఇతర పెట్టుబడులకు మళ్లిస్తుండటం కూడా గోల్డ్ రేట్స్ డౌన్‌ఫాల్‌కి మరో ముఖ్యకారణం.
మొన్నటిదాకా పసిడి దూకుడు చూస్తుంటే ఈ సంవత్సరాంతానికి పది గ్రాముల బంగారం ధర లకారం దాటుతుందనుకున్నారు. మనవల్ల కాదని మధ్యతరగతి డీలాపడేలా మిడిసిపడింది పసిడి. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రభావం బులియన్ మార్కెట్‌ని హిట్ చేసింది. ట్రంప్ గెలవడమే ఆలస్యం బంగారం ధర తగ్గుతూ వస్తోంది. చివరికి అంచనాలు ఎలా ఉన్నాయంటే పది గ్రాముల బంగారం ధర 60 వేలదాకా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. నాటోన్లీ ట్రంప్.. గ్లోబల్ మార్కెట్ నుంచి నెగిటివ్ సంకేతాలు, అంతర్జాతీయంగా నిల్వలు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు పసిడి ధరల్ని ప్రభావితం చేస్తున్నాయి. బంగారమే బెట్టు తగ్గించుకుంటే వెండిదేముంది. పసిడితో పాటు అదికూడా తగ్గుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర లక్షా వెయ్యికి వచ్చింది.
ట్రంప్ గెలవగానే డాలర్ ఒక్కసారిగా రికార్డు స్థాయికి ఎగబాకింది. దీంతో అంతర్జాతీయంగా గోల్డ్‌రేట్ ఒకే రోజు ఔన్సుకు 65డాలర్లకు పైగా పతనమైంది. డాలర్, గోల్డ్.. అవిభక్త కవలల్లాంటివి. డాలర్ విలువ పెరిగితే.. ఈక్విటీ మార్కెట్లు, బాండ్ ఈల్డ్స్‌పై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారు. ఇదే సమయంలో బంగారంపై ఆసక్తి తగ్గుతుంది. పెట్టుబడులు తగ్గటంతో సహజంగానే బంగారం ధరలు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే జరుగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంతో డాలర్ ర్యాలీ కొనసాగుతోంది. అది పెరిగేకొద్దీ బంగారం పడిపోతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. డాలర్ ఇండెక్స్ నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి పెరగడంతో బిక్కమొహమేస్తోంది బంగారం. ఇంతేనా.. ఇంతకంటే తగ్గుతుందా అనే మీమాసంతో వెయిటింగ్‌లో ఉన్నారు కొనుగోలుదారులు.
డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఎన్నికకాగానే బులియన్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనపడింది. ఇన్వెస్టర్లు గోల్డ్ నుంచి పెట్టుబడులను మళ్లించారు. దీంతో క్రిప్టో కరెన్సీకి రెక్కలొచ్చాయి. బిట్ కాయిన్ మూడ్రోజుల్లో ఏకంగా 33 శాతానికి పైగా లాభపడింది. దీనికితోడు అమెరికన్ మార్కెట్లో బుల్ రంకెలు వేయడం గోల్డ్ సెంటిమెంట్‌ని దెబ్బకొట్టింది. అక్టోబరు నెలాఖరుదాకా పసిడి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా భారీగా పెరుగుతూ పోయాయి. ముఖ్యంగా ఇరాన్- ఇజ్రాయెల్, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో సంక్షోభ సమయంలో డాలర్ డిమాండ్ తగ్గి.. బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే ఆల్ టైమ్ గరిష్ఠాలను కూడా తాకింది పసిడి ధర. ఈఏడాది అక్టోబర్ 30న 80వేల 450 రూపాయల ఆల్ టైమ్ హై రేట్‌ని టచ్ చేసింది గోల్డ్. ఈ ఏడాదిలో 35సార్లు ఆల్ టైమ్ హైతో.. ఓవరాల్‌గా 33 శాతం పెరుగుదలని నమోదుచేసింది. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది.
బులియన్ మార్కెట్‌లో ఒడిదుడుకులు కొత్తేం కాదు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఎప్పుడూ బంగారం ధరల్ని ఓ ఆట ఆడిస్తూనే ఉంది. 2020లో బంగారం ఆల్ టైమ్ హై ధరకు చేరింది. 2022లో కాస్త దిగొచ్చిన పసిడి ధర.. 2023లో మళ్లీ ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. 2022 మొదటి త్రైమాసికంలో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పుడు, బంగారం ధరలు 6శాతం పెరిగాయి. డిమాండ్ సప్లై, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, దిగుమతి సుంకాలు, గవర్నమెంట్ రిజర్వుల వంటి అంశాలు పసిడి హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతాయి. ఈ ఏడాది నవంబర్ నెలలోనూ తొలి ఐదురోజుల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. అయితే.. డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో పరిస్థితి ఒక్కసారిగా తారుమారయ్యింది. అమెరికా ఆర్థిక వ్యవస్థని ట్రంప్ గాడిలో పెడతారనే నమ్మకంతో ఇన్వెస్టర్లు డాలర్ వైపు మళ్లటంతో బంగారం బిక్కమొహం వేస్తోంది.
తాను గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధ ప్రమాదం ఉండదని ప్రచారంలో హామీ ఇచ్చారు ట్రంప్. అమెరికా ఆర్థికమాంద్యం బారిన పడకుండా చూస్తానని ఆయన ఇచ్చిన హామీ ఎన్నికల్లో బలంగా పనిచేసింది. ట్రంప్ గెలుపుతో ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని అంతా భావించటంతో.. డాలర్ గరిష్ఠస్థాయికి చేరింది. ఇన్వెస్టర్ల ఆలోచన మారటంతో పసిడిపై ఒత్తిడి తగ్గిపోయి ధర కూడా తగ్గుముఖం పట్టింది. బంగారం, వెండి ధరలు రాబోయే రోజుల్లో మరింతగా తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేస్తోంది అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయని భావిస్తున్నారు. అయితే ట్రంప్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఇలాగే ఉంటుందని చెప్పలేం. ట్రంప్ తన పాలసీలను ప్రకటించేదాకే కాస్త కంట్రోల్‌లో ఉంటుందంతే. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం నుంచే బంగారం ధర మళ్లీ పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
ప్రపంచం సంగతేమోగానీ మన భారతీయులకు బంగారమంటే ప్రాణం. అందుకే ఏటా టన్నుల కొద్దీ పసిడి మన దేశానికి దిగుమతి అవుతుంది. ప్రజలే కాదు ప్రభుత్వాలు కూడా బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. ఈమధ్యే భారతీయ రిజర్వ్ బ్యాంక్ 100 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో పసిడి నిల్వలే ఆదుకుంటాయని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. బంగారం నిల్వల్లో టాప్‌లో ఉంది అగ్రరాజ్యం. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి అమెరికా దగ్గర మొత్తం 8,133.5 టన్నుల బంగారం నిల్వలున్నాయి. రెండో ప్లేస్‌లో ఉన్న జర్మనీ దగ్గర 3,351.5 టన్నుల బంగారం నిల్వలున్నాయి. థర్డ్ ప్లేస్‌లో ఉన్న ఇటలీ దగ్గర 2,451.8 టన్నుల బంగారం ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ తర్వాత 2,436.9 టన్నుల బంగారంతో ఫ్రాన్స్ నాలుగోస్థానంలో ఉంది. రష్యా, చైనా, స్విట్జర్లాండ్ తర్వాత బంగారం నిల్వల్లో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. ఆర్బీఐ దగ్గర 854.7 టన్నులదాకా బంగారం నిల్వలున్నాయి.
భౌగోళిక, రాజకీయ అనిశ్చిత పరిస్థితులతో ప్రపంచంలో ఎప్పుడు ఏ మూల ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితులున్నాయి. ఎలాంటి ఒడిదుడుకులొచ్చినా స్థిరత్వాన్ని తీసుకొచ్చేందుకు బంగారాన్ని మించిన వనరు లేదని భావిస్తున్నాయి ప్రపంచదేశాలు. అలాంటి బంగారం ధర.. పెళ్లిళ్ల సీజన్లో తగ్గుతుండటం మన కొనుగోలుదారులకు ఊరటనిచ్చే అంశం. దేశవ్యాప్తంగా 48 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయని అంచనా. ఎంతలేదన్నా 6 లక్షల కోట్ల గోల్డ్ బిజినెస్ జరుగుతుంది. ఇలాంటి సమయంలో బంగారం ధర తగ్గడాన్ని వెల్‌కం చేస్తున్నారంతా. ధర చుక్కలనంటడంతో ధన త్రయోదశిలో జనం పెద్దగా బంగారాన్ని కొనలేకపోయారు. ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాలతో ధర దిగొస్తుండటంతో.. పసిడి అందరినీ తెగ ఎట్రాక్ట్ చేస్తోందిప్పుడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి