
భారతీయులకు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు సంస్కృతిలో అంతర్భాగం.. ఒక బలమైన పెట్టుబడి. అయితే ఇటీవల అంతర్జాతీయ అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల నిల్వలు పెంపు, అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు వంటి పలు కారణాల వల్ల పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర తులం రూ. 1.21 లక్షలు ఉండగా, 22 క్యారెట్ల ఆభరణాల ధర కూడా రూ. 1.12 లక్షల దిశగా పరుగులు పెడుతోంది. ఈ ధరల పెరుగుదలతో సామాన్యులు బంగారం కొనడం కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ క్యారెట్ల బంగారు ఆభరణాలు కొనుగోలుదారులకు మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.
బంగారం ధరలు పెరగడంతో, కొనుగోలుదారులు ఇప్పుడు 14 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారు ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. స్వచ్ఛతలో కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, వీటి ధర తక్కువగా ఉండటంతో పాటు, మన్నిక ఎక్కువగా ఉండటం ప్రధాన ఆకర్షణ. ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ ప్రకారం.. 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ధర గ్రాముకు రూ. 12,153.,906 గా ఉంది. అంటే 10 గ్రాములు (తులం) రూ. 1,21,530 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 11,860 గా ఉంది. అంటే తులం ధర రూ. 1,18,600గా ఉంది.
18 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర చూస్తే గ్రాముకు కేవలం రూ. 9,844 గానే ఉంది. 10 గ్రాములకు రూ. 98,440 పడుతుంది. ఇక 14 క్యారెట్ల బంగారు ఆభరణాల ధర ఇంకా తక్కువగా గ్రాముకు రూ. 7,838 గా ఉంది. అంటే తులం ధర రూ. 78,380 మాత్రమే పడుతుంది. ఈ విధంగా 14 క్యారెట్ల బంగారం ధర, 22 క్యారెట్ల బంగారం కంటే దాదాపు 35శాతం తక్కువగా ఉంది.
బంగారంలో స్వచ్ఛతను క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 24 క్యారెట్ అంటే 99.9శాతం స్వచ్ఛత కలిగిన ప్యూర్ గోల్డ్. 22 క్యారెట్ ఆభరణాలలో 91.7శాతం బంగారం ఉంటుంది. 18 క్యారెట్లలో 75శాతం బంగారం ఉంటుంది. ఇక 14 క్యారెట్ల విషయానికి వస్తే.. ఇక్కడ 58.33శాతం బంగారం ఉంటుంది. ఈ తక్కువ క్యారెట్ల ఆభరణాల్లో ఇతర మిశ్రమాలు ఎక్కువగా కలపడం వల్ల ఇవి 22 క్యారెట్ల బంగారం కంటే గట్టిగా, మన్నికగా ఉంటాయి. అందుకే రోజూ ధరించే గొలుసులు, ఉంగరాలు వంటి జువెల్లరీకి ఇవి బెస్ట్ ఎంపిక.
తక్కువ క్యారెట్ల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా కొనుగోలుదారులు తప్పనిసరిగా బీఐఎస్ హాల్‌మార్కింగ్‌ను తనిఖీ చేయాలి. ఆభరణంపై బీఐఎస్ లోగో, క్యారెట్స్, ప్యూరిటీ, ఆరు అంకెల హెచ్‌యూఐడీ (HUID) నంబర్ ముద్రించి ఉంటుంది. ఈ వివరాలను బీఐఎస్ కేర్ యాప్‌లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ధరల భారంతో సతమతమవుతున్న వారికి మన్నిక, ధర పరంగా 14K, 18K బంగారం ఒక తెలివైన ఎంపికగా నిలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..