
గత కొన్ని నెలలుగా వేగంగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం పాతాళానికి పడిపోయాయి. కేవలం వారం రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర 5,200 డాలర్ల నుంచి 4,400 డాలర్లకు పడిపోయింది. ఇది బంగారంపై ఇన్వెస్ట్ చేసిన అందరినీ షాక్‌కి గురిచేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా పసిడి ధరలు పడిపోవడంతో.. దేశీయ మార్కెట్లపై కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది.ఈ దెబ్బతో గోల్డ్ లోన్ తీసుకున్న సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.బంగారం తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్న వారికి.. బ్యాంకుల నుంచి మార్జిన్ కాల్స్ మొదలయ్యాయి.

బంగారం ధరలు తగ్గడంతో ఎల్‌టీవీ రేషియో పెరిగిపోయి.. అదనపు నగలు లేదా నగదు కట్టాలని బ్యాంకులు డిమాండ్ చేస్తున్నాయి.మరోవైపు వెండి ధరలు కూడా బేజారెత్తిస్తున్నాయి.. ఎంసీఎక్స్‌లో వెండి కిలోకు ఏకంగా 12 శాతం మేర పతనమైంది.

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో పాటు క్రూడాయిల్ ధరలు 120 డాలర్లకు చేరడమే ఈ సంక్షోభానికి కారణమని తెలుస్తోంది. డాలర్ విలువ విపరీతంగా పెరగడం.. ఇన్వెస్టర్లు గోల్డ్ వదిలి డాలర్ వైపు మళ్లడం పసిడి పతనానికి దారితీసింది.

ఇరాన్ టెన్షన్ల వల్ల క్రూడాయిల్ సరఫరాపై పెట్రోలియం శాఖ ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించింది.రష్యా, టర్కీ లాంటి దేశాలు తమ గోల్డ్ రిజర్వులను మార్కెట్‌లో అమ్మేస్తుండటంతో.. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో బంగారం ధర 4,100 డాలర్ల మార్కుకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.