Gold ETF: 10 లక్షల పెట్టుబడికి..కోటి రూపాయల రాబడి వస్తే.. !

10 లక్షల పెట్టుబడికి..కోటి రూపాయల రాబడి వస్తే ఎలా ఉంటుంది..? ఆఫర్ అదిరిపోయింది కదా..! అయితే ఇదేదో బురిడీ స్కీమ్‌ కాదు..గోల్డ్‌ మాయ. బంగారం ధరలు ఆల్ టైమ్ హైలో ట్రేడవుతుండడంతో..గోల్డ్ ఈటీఎఫ్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు ఇన్వెస్టర్లు.. ఏడాది వ్యవధిలోనే గోల్డ్‌ ధర 50 శాతానికిపైగా పెరగడంలో వారిలో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.. 

Gold ETF: 10 లక్షల పెట్టుబడికి..కోటి రూపాయల రాబడి వస్తే.. !
Gold

Updated on: Oct 11, 2025 | 7:59 PM

ఓవైపు ట్రంప్‌ టారిఫ్‌ల టెన్షన్‌..మరోవైపు స్టాక్‌ మార్కెట్‌లో నెలకున్న అనిశ్చితి పరిస్థితులతో ఇన్వెస్టర్ల ఆసక్తి మారుతోంది. పసిడి ధరలు పరుగులు పెడుతుండటంతో వారంతా ఇప్పుడు ఈక్విటీల నుంచి బంగారంలోకి పెట్టుబడులను మారుస్తున్నారు. గత నెల గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్ అంటే గోల్డ్‌ ఈటీఎఫ్‌లోకి వచ్చిన నిధుల ప్రవాహమే అందుకు నిదర్శనం. ఆగస్టులో గోల్డ్‌ ఈటీఎఫ్‌లోకి 2 వేల 190 కోట్ల పెట్టుబడులు రాగా..సెప్టెంబరులో ఆ మొత్తం నాలుగింతలై 8 వేల 363 కోట్లకు పెరిగింది. ఇది 7.3 టన్నుల గోల్డ్‌‌ విలువకు సమానం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇదే అత్యధికం. దీంతో మ్యూచువల్‌ ఫండ్ల నిర్వహణలో ఉన్న గోల్డ్‌ ఈటీఎఫ్‌ల ఆస్తుల విలువ మొత్తం 90 వేల కోట్లు దాటింది. మరోవైపు గోల్డ్‌ ఈటీఎఫ్‌లకుకూడా డిమాడ్ పెరిగింది. పెట్టుబడుల్లో వైవిధ్యం కో ఇన్వెస్టర్లు లోహాల వైపు మొగ్గు చూపుతున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

సెప్టెంబరులో రూ.75.61 లక్షల కోట్లకు చేరిన ఏయూఎం

గోల్డ్‌ ఈటీఎఫ్‌లోకి పెట్టుబడులు మళ్లుతుండడంతో..ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లలోకి నిధుల ప్రవాహం తగ్గుతోంది. సెప్టెంబరులో మ్యూచువల్‌ ఫండ్ల ఆధ్వర్యంలోని AUM 75 లక్షల 61 వేల కోట్లకు చేరింది. ఆగస్టులో ఇది 75 లక్షల 19 వేల కోట్లుగా ఉంది. మొత్తం పోర్ట్‌ఫోలియోల సంఖ్య 25.19 కోట్లకు చేరింది. గత నెలలో కొత్తగా 30.14 లక్షల ఫోలియోలు జతయ్యాయి. ఇక రిటెయిల్‌ ఫోలియోలు 19.81 కోట్లకు పెరిగాయి. ఇక సిప్‌ ద్వారా గత నెలలో 29 వేల 360 కోట్ల రికార్డు పెట్టుబడులు వచ్చాయి. మొత్తం సిప్‌ ఏయూఎం రూ.15.52 లక్షల కోట్లకు చేరింది. సిప్‌ ఖాతాల సంఖ్య 9.25 కోట్లకు పెరిగింది.

10 గ్రాముల 22k బంగారానికి రూ. 70 to 75 వేల రుణం

బంగారం ధర దాదాపు ఏడాదిన్నర కాలంలోనే రెట్టింపు అయింది. దీంతో ఆభరణాలను కొనుగోలు చేయలేని పరిస్థితి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎదురవుతోంది. ఆభరణాల విక్రయాలు తగ్గినట్లు వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో బంగారం ఆభరణాల తనఖా వ్యాపారం మాత్రం అనూహ్యంగా పెరుగుతోంది. గోల్డ్ రేట్‌ భారీగా పెరగడంతో గతంతో పోల్చితే బంగారంపై ఎక్కువ సొమ్ము లభిస్తోంది. అందుకే చాలామంది తమ అవసరాలకు ఆభరణాలను తనఖా పెట్టి అప్పులు తీసుకుంటున్నారు. 10 గ్రాముల బరువు ఉన్న 22 క్యారెట్ల పసిడి ఆభరణాన్ని తనఖా పెడితే బ్యాంకులు రూ.70 నుంచి 75 వేల వరకు అప్పు ఇస్తున్నాయి. బ్యాంకింగేతర సంస్థలు రూ.80 నుంచి 85 వేలు మంజూరు చేస్తున్నాయి. ఆభరణాలు తనఖా పెట్టుకుని బ్యాంకులు జారీచేసిన రుణాలు ఈ ఏడాది మార్చి నాటికి 18 శాతానికి పెరిగాయి. ఈ ఏడాది మార్చిలో రూ.11.8 లక్షల కోట్లుగా ఉన్న పసిడి రుణాల మార్కెట్, 2026 ఏడాది మార్చి నాటికి రూ.15 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. మొత్తానికి భారీగా పెరుగుతున్న బంగారం ధరలు అనేక రంగాలపై ప్రభావం చూపుతున్నాయి.