Gold Prices: బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్.. సాయంత్రానికి పూర్తిగా మారిన లెక్కలు.. రూ.2 లక్షల మార్క్..!

బంగారం ధరలు 2 లక్షల మార్క్‌కు చేరువలో ఉన్నాయి. ఉదయం లక్షా 80 వేల వద్ద ట్రేడవ్వగా.. సాయంత్రానికి లక్షా 90 వేలకు చేరుకున్నాయి. వెండి ధర కూడా పరుగులు తీస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో దేశంలో పసడి ధరలు పరుగులు తీయడం షాకింగ్‌గా మారింది.

Gold Prices: బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్.. సాయంత్రానికి పూర్తిగా మారిన లెక్కలు.. రూ.2 లక్షల మార్క్..!
Today Gold Rate

Updated on: Jan 29, 2026 | 7:45 PM

భౌగోళిక పరిస్ధితులు, ఆర్ధిక ఉద్రిక్తతల నడుమ పసిడి ధరలు దూసుకెళ్తున్నాయి. బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ విధానం తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు బంగారంను స్వర్గధామంగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దీంతో పసిడి రేట్లు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిని నమోదు చేశాయి. గురువారం ఉదయంతో పోలిస్తే సాయంత్రానికి లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఉదయం బంగారం రేట్లు రూ.12 వేలు పెరగ్గా.. వెండి రూ.25 వేలు పెరిగింది. కానీ సాయంత్రానికి బంగారం మరింతగా పెరిగి షాకిచ్చింది. రూ.2 లక్షల మార్క్‌కు చేరువలో బంగారం ఉంది.

భారీగా పెరిగిన బంగారం ధర

మల్టీ కమోడిటీ ఎక్చేంజ్ ప్రకారం గురువారం సాయంత్రం 7 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 1,91,151 వద్ద ట్రేడవుతోంది. 10 గ్రాములకు ఏకంగా రూ.13,998కి పెరిగింది. మునుపటి మార్కెట్ ముగింపులో 10 గ్రాములు రూ.1,77,153 వద్ద స్థిరపడింది. ఇక వెండి ధరలు కూడా పెరిగాయి. మునుపటి ట్రేడింగ్ ముగింపు సమయానికి కేజీ వెండి రూ.3,85,366 వద్ద స్ధిరపడగా.. సాయంత్రం 7 నాటికి రూ. 4,12,800 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే రూ.27 వేల మేర పెరిగింది.

2 లక్షల మార్క్‌కు చేరువలో

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ ఔన్సు బంగారం ధర 5600 డాలర్ల నుంచి 5602 డాలర్లకు చేరుకున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకు 30 శాతం గోల్డ్ పెరిగింది. మునుపటి సెషన్‌లో స్పాట్ ధరలు 4.6 శాతం పెరిగాయి. ఇవాళ మూడో సెషన్‌లోనూ బంగారం ధరలు లాభాలను కొనసాగించాయి. నేటి ర్యాలీలో కేవలం 2 లక్షల మైలురాయికి చేరువలో బంగారం ధరలు ఉన్నాయి. నేడో, రేపో 2 లక్షల మార్క్‌కి చేరుకునే అవకాశముంది. 2025లో ఏకంగా 64 శాతం బంగారం ధరలు పెరగ్గా.. ఈ సంవత్సరంలో ఇప్పటికే 27 శాతం పెరిగింది. ఇక వెండి ధర 67 శాతం పెరిగింది. ఇక బంగారం ధరలు తొలిసారి రూ.1.91 లక్షలకు పెరగ్గా.. జనవరిలో ఇప్పటివరకు 31 శాతం ధరలు పెరిగాయి.