Gold: బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు! మరి భారత్‌ పరిస్థితి ఏంటంటే?

భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బంగారం ప్రధాన పెట్టుబడి సాధనంగా మారింది. పోలాండ్ (20 టన్నులు), ఉజ్బెకిస్థాన్ (8 టన్నులు) వంటి చిన్న దేశాలు భారీగా బంగారం కొనుగోలు చేస్తూ తమ నిల్వలను పెంచుకుంటున్నాయి. డాలర్‌పై ఆధారపడటం తగ్గించుకోవడం, కరెన్సీ స్థిరత్వం కోసం దేశాలు ఈ ధోరణిని అనుసరిస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

Gold: బంగారాన్ని బీభత్సంగా కొన్న ఆ రెండు దేశాలు! మరి భారత్‌ పరిస్థితి ఏంటంటే?
Gold

Updated on: Apr 12, 2026 | 9:00 AM

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో బంగారం మళ్లీ ప్రధాన పెట్టుబడి సాధనంగా మారుతోంది. ముఖ్యంగా చిన్న దేశాలు కూడా భారీగా బంగారం కొనుగోలు చేస్తూ, పెద్ద ఆర్థిక వ్యవస్థలకు పోటీగా నిలుస్తున్నాయి. ఇటీవల గణాంకాల ప్రకారం పోలాండ్‌ ఫిబ్రవరి నెలలోనే 20 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ కొనుగోలుతో ఆ దేశపు మొత్తం బంగారు నిల్వలు సుమారు 570 టన్నులకు చేరాయి. గత ఏడాది కాలంలోనే పోలాండ్ దాదాపు 102 టన్నుల బంగారాన్ని సేకరించడం విశేషం.

అదేవిధంగా ఉజ్బెకిస్థాన్‌ కూడా బంగారం కొనుగోళ్లలో చురుకుగా ఉంది. ఫిబ్రవరిలో 8 టన్నుల బంగారం కొనుగోలు చేసిన ఈ దేశం, తన మొత్తం నిల్వలను 407 టన్నులకు పెంచుకుంది. 2025లో మాత్రమే 10–15 టన్నుల మధ్య బంగారాన్ని జోడించినట్లు సమాచారం. ఇక భారత్‌ విషయానికి వస్తే, ఫిబ్రవరిలో బంగారం కొనుగోలు తక్కువగా నమోదైంది. ఈ నెలలో కేవలం 0.2 టన్నుల బంగారాన్ని మాత్రమే భారత్ కొనుగోలు చేసింది. అయితే మొత్తం బంగారు నిల్వలు సుమారు 880 టన్నులుగా ఉన్నాయి. గత ఏడాదిలో భారత్ సుమారు 27 టన్నుల బంగారాన్ని సేకరించింది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి, డాలర్‌పై ఆధారపడే పరిస్థితిని తగ్గించుకోవాలనే ప్రయత్నం, కరెన్సీ స్థిరత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దేశాలు బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. పోలాండ్, ఉజ్బెకిస్తాన్ వంటి చిన్న దేశాలు కూడా భారీగా బంగారం నిల్వలు పెంచుకోవడం, గ్లోబల్ ఆర్థిక సమీకరణాల్లో మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని దేశాలు కూడా ఈ ధోరణిని అనుసరించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us