ప్రతి ఇంట్లో వంటకు గ్యాస్ అనేది తప్పనిసరైంది. గతంలో కట్టెల పొయ్యిలపై వంటలు చేసే వారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వంటలకు పొయ్యిలపై ఆధారపడే వారు. అయితే పెరుగుతున్న అవసరంతో పాటు కట్టెల పొయ్యిపై వంట చేయడం శ్వాస సంబంధిత సమస్యలు వస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చేందుకు ఉజ్వల యోజన పథకం తీసుకొచ్చింది. మొదట్లో 5 కోట్ల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రారంభించారు. తర్వాత ఈ పథకంతో 8 కోట్ల మంది మహిళలను అనుసంధానం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ పథకం కింద ఇంట్లోని మహిళలకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్‌ను అందజేస్తారు. ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో ఎల్‌పీజీ కవరేజీ 2022 సంవత్సరంలో 104.1 శాతానికి పెరిగింది . 2016లో ఇది 62 శాతంగా ఉంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గత 6 సంవత్సరాలలో 9 కోట్లకు పైగా డిపాజిట్ రహిత ఎల్‌పీజీ కనెక్షన్లు పంపిణీ చేశారు. ఈ పథకం కింద 35.1 శాతం మంది లబ్ధిదారులు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల నుండి వచ్చారు. ఈ పథకంలోలబ్ధి పొందడానికి ఉన్న అర్హతలను ఓ సారి తెలుసుకుందాం.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఎల్‌పీజీ కనెక్షన్లను ఇస్తుంది. మహిళలు మాత్రమే ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉంటారు. అలాగే దరఖాస్తుదారు మహిళ వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. ఇది కాకుండా అదే ఇంట్లో ఈ పథకం కింద మరేదైనా ఎల్‌పీజీ కనెక్షన్ ఉంటే ఈ పథకంలో లబ్ధిదారులు కాలేరు.
ఉజ్వల పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్, ఫుల్ సిలిండర్, స్టవ్ ఇస్తోంది. అలాగే మొదటి రీఫిల్‌ను ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..