ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డీ).. సురక్షిత పెట్టుబడి పథకం. స్థిరమైన వడ్డీతో కచ్చితమైన రాబడిని అందిస్తుంది. అందుకే వీటికి అధికశాతం మంది పెట్టుబడిదారులు మొగ్గుచూపుతారు. పైగా గత రెండు సంవత్సరాలకు లాభాలను సైతం గడించారు. ఎందుకంటే ఈ కాలంలో వడ్డీ రేట్లు తగ్గలేదు. ఎక్కువ కాలం గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అయితే ఇది శాశ్వతం కాదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రెపో రేటును యథాతథంగా ఉంచింది కాబట్టి వడ్డీ రేట్లు కూడా హైక్‌లో కొనసాగాయి. అయితే రానున్న కాలంలో పరిస్థితి ఇలా ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఎఫ్‌డీ పెట్టుబడిదారులు ఎలా ఆలోచించాలి? అసలు ఎఫ్‌డీ రేట్లు ఎందుకు తగ్గుతాయని చెబుతున్నారు? తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..
బ్యాంక్ ఆఫ్ జపాన్, యూఎస్ ఫెడ్ ఇప్పటికే రేట్లు తగ్గించే దిశగా చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కూడా వాటిని అనుసరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. యూఎస్ ఫెడ్ షెడ్యూల్డ్ మీటింగ్ తర్వాత ఎఫ్‌డీ రేటు తగ్గింపు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఉంటుందని పేర్కొంది. అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా గణనీయంగా పెంచిన రేట్ల కారణంగా ప్రణాళికేతర తగ్గింపునకు వెళ్లాలని దానిపై ఒత్తిడి పెరిగింది. దీంతో 25 నుంచి 27 బీపీఎస్ వరకూ రేటు తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది భారతదేశం వంటి ఇతర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మన దేశంలో 100బీపీఎస్ వరకూ రేటు తగ్గింపు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ ప్రధాన ఆందోళనలలో ఒకటి. దానిని 4% వద్దకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఐదు నెలల పాటు వరుసగా తగ్గినప్పటికీ, జూన్లో మళ్లీ 5.08%కి పెరిగింది. ఇది తగ్గితే తప్ప వడ్డీ రేట్ల తగ్గింపునకు వెళ్లే ఆస్కారం లేదు. అయితే యూఎస్ ఫెడ్ వచ్చే సెప్టెంబర్లో వడ్డీ రేట్లు తగ్గిస్తే.. అప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
వడ్డీ రేటు తగ్గింపునకు అసలైన కౌంట్‌డౌన్ ఇప్పుడు మొదలైంది. సమీప భవిష్యత్తులో ఎఫ్డీ రేట్లలో తగ్గింపు ఉండకపోవచ్చు, కానీ రాబోయే 9-12 నెలల్లో మాత్రం రేట్లు భారీగా తగ్గే అవకాశం మాత్రం మెండుగా ఉంది. మరి ఇలాంటి సమయంలో పెట్టుబడిదారులు ఏం చేయాలి? సహజంగానే అందరూ దీని గురించి ఆలోచిస్తారు. మీ వద్ద మిగులు నిధులు ఉన్నా లేదా.. ఎఫ్డీలు కొన్ని వారాల్లో మెచ్యూరిటీ సాధించే అవకాశం ఉన్నా.. వాటిని ప్రస్తుతం ఉన్న అధిక వడ్డీ రేట్లకు మరికొంత సమయం లాక్ చేయడం మంచిది. ముఖ్యంగా ఫిక్స్ డ్ వడ్డీ ఉండే పథకాలకు ఇది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ ఫ్లోటర్ రేటు అయితే మాత్రం ఈ ఆలోచన అంత మేలు చేసేది కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..