Banana Leaves: దక్షిణ భారతదేశంలో అరటి ఆకులలో భోజనం చేయడం ఆచారం. అంతేకాదు అరటి ఆకులను భారతదేశంలో, ఆగ్నేయాసియాలోని చాలా దేశాలలో పండుగలు, వివాహాలు, ఇతర వేడుకలలో అలంకరణ కోసం ఉపయోగిస్తారు. అరటి ఆకుల వ్యాపారం చిన్న, సన్నకారు రైతులకు చాలా ఉపయోగపడుతుంది. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలు సాధించవచ్చు. అరటి ఆకులలో ఆహారం వడ్డిస్తే అది ప్రత్యేక రుచిని సంతరించుకుంటుంది. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో అరటి ఆకుల వ్యాపారం కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ బిజినెస్ వార్షిక టర్నోవర్ రూ.2 కోట్ల 50 లక్షలుగా ఉంది. అరటి ఆకులను ఉపయోగించడం వల్ల సంప్రదాయాన్ని పాటించడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసినవారమవుతాం.
ఎల్లప్పుడూ డిమాండ్
ఏడాది పొడవునా అరటి ఆకులకు డిమాండ్ ఉంటుంది. అరటి ఆకుల సాగు కొన్ని రాష్ట్రాలలో వాణిజ్య పంటగా మారింది. ఈ వ్యాపారం చిన్న రైతులకు ఏడాది పొడవునా స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. అంతేకాదు అరటి పండ్ల వల్ల నష్టాల బారిలో ఉన్న రైతులకు అరటి ఆకుల వ్యాపారం కొంత ఉపశమనం కలిగిస్తుంది.
ఆకుల కోసం కొన్ని రకాల సాగు
అరటిలో ఆకుల కోసం కొన్ని రకాల ప్రత్యేక విత్తనాలను వాడుతున్నారు. అందులో పూవన్, మొంతన్, పాయెన్, సకాయ్, కర్పూర్వల్లి వంటివి ఉన్నాయి. అంతేకాదు ఈ చెట్ల అరటి పండ్లు వివిధ ఆహారాలలో కూడా వాడుతున్నారు. అరటి రైతులు వీటి ఆకులను పెద్ద ఎత్తులో ఎగుమతి చేస్తున్నారు. అంతేకాదు వీటికి రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది.