Vande Bharat Trains: విదేశాల్లోనూ పరుగులు పెట్టనున్న వందే భారత్ రైళ్లు.. అతి త్వరలోనే..

|

Aug 16, 2024 | 5:14 PM

బీఈఎంఎల్ ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైలు మొదటి నమూనాను తయారు చేసే పనిలో ఉంటుంది. కొన్ని నెలల్లో రైలును తయారు చేసి ఆవిష్కరించనుంది. ఆ తర్వాత కంపెనీ అనేక ప్రణాళికలు రూపొందించుకుంది. మిడిల్ ఈస్ట్, దక్షిణ అమెరికా, ఆసియా దేశాలకు వందే భారత్ రైళ్లను ఎగుమతి చేయాలని భావిస్తోంది.

Vande Bharat Trains: విదేశాల్లోనూ పరుగులు పెట్టనున్న వందే భారత్ రైళ్లు.. అతి త్వరలోనే..
Vande Bharat
Follow us on

సాంకేతికతకు మారుపేరుగా జపాన్, చైనా, అమెరికా వంటి దేశాలను చెప్పుకుంటాం. ప్రపంచంలోని అన్ని దేశాలకు వాటి నుంచి అనేక వస్తువులు ఎగుమతి అవుతాయి. ఇప్పుడు వాటితో మన దేశం కూడా పోటీ పడుతోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని భారీ పరికరాల తయారీ సంస్థ (బీఈఎంఎల్) ఇందుకోసం ప్రణాళికలు రూపొందించింది. వందే భారత్, మెట్రో రైళ్లను ఎగుమతి చేయడం ద్వారా ప్రపంచంలో తన మార్కెట్ ను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్, దక్షిణ అమెరికా, ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకుంది.

వందే భారత్ రైళ్ల తయారీ..

బీఈఎంఎల్ ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ రైలు మొదటి నమూనాను తయారు చేసే పనిలో ఉంటుంది. కొన్ని నెలల్లో రైలును తయారు చేసి ఆవిష్కరించనుంది. ఆ తర్వాత కంపెనీ అనేక ప్రణాళికలు రూపొందించుకుంది. మిడిల్ ఈస్ట్, దక్షిణ అమెరికా, ఆసియా దేశాలకు వందే భారత్ రైళ్లను ఎగుమతి చేయాలని భావిస్తోంది. దానికి గల అవకాశాల కోసం అన్వేషణ సాగిస్తోంది. వాటి ద్వారా ప్రపంచ మార్కెట్‌లో తన ఉత్పత్తులను విస్తరించనుంది. రైలు, మెట్రో సెగ్మెంట్లతో రక్షణ రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇవి తమ ఆదాయానికి అతిపెద్ద సహకారిగా మారుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఉన్న నాలుగు శాతం ఎగుమతులను పదిశాతానికి పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

ఎగుమతులకు ప్రణాళిక..

బీఈఎంఎల్ చైర్మన్ శంతను రాయ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన వివరాల ప్రకారం.. భారతీయ రైల్వే కోసం స్వదేశీ వందే భారత్ రైళ్లను విడుదల చేయడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తోంది. అనంతరం ప్రపంచ మార్కెట్ పై దృష్టి సారిస్తుంది. ముఖ్యంగా ఎగుమతులను పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. కొత్తగా నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో భాగంగా వృద్ధిని పెంచుకోవడానికి , తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి బీఈఎంఎల్ లో కొన్ని మార్పులు జరిగాయి. మైనింగ్, నిర్మాణం, రక్షణ, రైలు, మెట్రో తదితర విభాగాలపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఈ విభాగాలకు సంబంధించి 11 వ్యూహాత్మక వ్యాపార యూనిట్లను (ఎస్బీయూలు) ఏర్పాటు చేసింది.

ఆర్థిక ప్రగతి..

బీఈఎంఎల్ లో జరిగిన మార్పుల కారణంగా ఆర్థికంగా మెరుగుదల కనిపించింది. 2024 జూన్ 30 నాటికి ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర నష్టం రూ. 70 కోట్లకు తగ్గింది. దానితో పాటు టాప్ లైన్‌లో 10 శాతం వృద్ధిని సాధించింది. గతంతో పోల్చితే గణనీయమైన మెరుగుదలను కనిపించింది. దీంతో భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలను కంపెనీ నిర్దేశించుకుంది. కంపెనీ లెక్కల ప్రకారం.. ఈబీఐటీడీఏ వృద్ధికి 13 శాతం నుంచి 16, 17 శాతానికి చేరుకోవాలని భావిస్తున్నారు. రైలు, మెట్రో, రక్షణ రంగాలపై దృష్టి సారించడంతో భవిష్యత్తు లో అది సాధ్యమేనని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..