
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం మాట్లాడుతూ.. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) ధరలు రాబోయే నాలుగు నుండి ఆరు నెలల్లో పెట్రోల్‌తో నడిచే వాహనాల ధరతో సమానంగా ఉంటాయని అన్నారు. ప్రస్తుతం పెట్రోల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో వాటి ధర తగ్గుతుందని ఆయన అన్నారు. ఇంధన దిగుమతులకు ఏటా రూ.22 లక్షల కోట్లు ఖర్చవుతున్నందున భారత్ శిలాజ ఇంధనాలపై ఆధారపడటం ఆర్థిక భారం అని, ఇది పర్యావరణానికి కూడా ప్రమాదకరమని, దేశ పురోగతికి స్వచ్ఛమైన శక్తిని స్వీకరించడం చాలా కీలకమని గడ్కరీ అన్నారు.
20వ FICCI ఉన్నత విద్యా సదస్సు 2025లో నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ.. రాబోయే 4-6 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వాహనాల ధరకు సమానం అవుతాయి. ఇంకా ఐదేళ్లలోపు, భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1గా మార్చడమే మా లక్ష్యం అని మంత్రి అన్నారు. నేను రవాణా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.14 లక్షల కోట్లు. ఇప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.22 లక్షల కోట్లు అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ.78 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేయగా, చైనా రూ.47 లక్షల కోట్లు, భారత్ రూ.22 లక్షల కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఉదాహరణకు మీరు టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.731,890 నుండి ప్రారంభమవుతుంది. అదే సమయంలో టాటా నెక్సాన్ EV రూ.12.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇది గణనీయమైన వ్యత్యాసాన్ని సూచిస్తుంది. SUVలు, హ్యాచ్‌బ్యాక్‌లు, వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ఇతర విభాగాలలో కూడా ఇదే విధమైన ధోరణి కనిపిస్తుంది. సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే EV ధరలు ఎక్కువగా ఉంటాయి. కానీ, తాజాగా గడ్కరీ చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే రానున్న కాలంలో ఈవీల ధరలు తగ్గొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి