
కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆర్ధికశాఖ కార్యాలయం బయట బడ్జెట్ ట్యాబ్‌ను ప్రదర్శించారు. సాంప్రదాయ ఎరుపు రంగు బాహీ-ఖాతా శైలి బ్యాగ్‌లో ఉన్న డిజిటల్ టాబ్లెట్‌ను చేతిలో పట్టుకుని కనిపించారు. అనంతరం ఆర్ధికశాఖ కార్యాలయం నుంచి బయల్దేరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేందుకు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. బడ్జెట్‌కు ముందు రాష్ట్రపతిని కలవడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రపతిని కలిసిన అనంతరం పార్లమెంట్‌కు బయల్దేరుతారు. కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌కు ఆమోదం లభించిన అనంతరం పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.
కేంద్ర బడ్జెట్ ప్రదర్శనలో అనేక భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతంలో ఎరుపు రంగు బ్రీఫ్ కేస్‌లో బడ్జెట్ పత్రాలు ఉండేవి. ఆర్ధికశాఖ మంత్రులు ఎరుపు రంగులో ఉన్న బ్రీఫ్ కేస్‌తో వచ్చి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ కాలనుగుణంగా అందులో మార్పులు వచ్చాయి. 2019లో బ్రీఫ్‌కేస్ కాకుండా బహీ ఖాతా అనే సాంప్రదాయ భారత అకౌంటింగ్ లెడ్జర్ విధానాన్ని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బ్యాగ్ పూర్తిగా ఎరుపు రంగులోనే ఉంటుంది. దానిపై భారత జాతీయ చిహ్నం ముద్రించి ఉంటుంది. 2021 నుంచి పేపర్ లెస్ విధానంలో డిజిటల్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మేడ్ ఇన్ ఇండియా టాబ్లెట్ ద్వారా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
బడ్జెట్ కోసం ఎరుపు రంగు బ్యాగులనే వాడటం అనేది సాంప్రదాయంగా వస్తుంది. బ్రిటీష్ కాలం నుంచి ఈ ఆనవాయితీ తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. 1860లో భారత్ బ్రిటిష్ పాలనలో ఉన్నప్పటి నుంచి ఈ విధానం కొనసాగుతూ వస్తోంది. బ్రిటన్‌లో ప్రభుత్వ చట్టపరమైన డాక్యుమెంట్స్, ఆర్ధిక పత్రాలను భద్రపరిచేందుకు ఎరుపు రంగు కవర్లను వాడేవారు. ఎరుపు రంగు అంటే అధికారం, బాధ్యతకు సంకేతంగా భావించేవారు. దీంతో బడ్జెట్ తీసుకొచ్చే బ్యాగులకు కూడా ఈ కలర్‌ను వాడటం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. భారత్‌కు స్వాతంత్రం వచ్చాక కూడా బ్రిటీష్ సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఉన్నాం.
2021లో నిర్మలమ్మ తొలిసారి పేపర్ లెస్ బడ్జెట్‌కు శ్రీకారం చుట్టారు. దేశం టెక్నాలజీ పరంగా అభివృద్ది చెందుతుండటంతో బడ్జెట్ ప్రవేశపెట్టే పద్దతిని కూడా మార్చాలని ఆమె నిర్ణయించుకున్నారు. అందుకే డిజిటల్ బడ్జెట్ తీసుకొచ్చారు. అలాగే అప్పటినుంచి ఎరుపు రంగు బహి ఖాతా తరహా పౌచ్‌లో బడ్జెట్ ట్యాబ్‌ను తీసుకొస్తున్నారు. దేశంలో వ్యాపారులు, వ్యాపార కుటుంబాలు తమ ఖాతాలను నిర్వహించడానికి బహి ఖాతాను దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. దీంతో నిర్మలా సీతారామన్ సాంప్రదాయ బహి ఖాతాను తీసుకొచ్చారు.
Delhi | Union Finance Minister Nirmala Sitharaman calls on President Droupadi Murmu before presenting her ninth consecutive Union Budget pic.twitter.com/oUOk88wr1x
— ANI (@ANI) February 1, 2026
ఇక నిర్మలా సీతారామన్ ప్రతీసారి బడ్జెట్ ప్రవేశపట్టే సమయంలో ప్రత్యేక చీర ధరించి కనిపిస్తున్నారు. ఈ సారి తమిళనాడు కాంచీపురం పట్టు చీరను ధరించారు. ఊదా రంగు గీసిన ఈ చీర.. కాఫీ బ్రౌన్ బార్డర్, లేత బంగారు గోధుమ రంగు చెక్కులతో ఉంది. చేతితో నేసిన ఈ కాంచీపురం చీరను ధరించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు వచ్చారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి