తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..? వీలునామా లేకపోతే ఎవరికి చెందుతుంది..!
తండ్రి లేదా తాతల ఆస్తిపై కొడుకులు, కూతుళ్లకు సమాన హక్కు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తల్లి పేరు మీద ఉన్న ఆస్తిపై కూతుళ్లకు ఎలాంటి హక్కులు ఉంటాయి? ఒకవేళ తల్లి ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది? హిందూ, ముస్లిం చట్టాల్లో ఉన్న ఆ కీలక నిబంధనలేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే..

తల్లిదండ్రుల ఆస్తి పంపకాల విషయంలో కుటుంబాల్లో వివాదాలు తలెత్తడం సర్వసాధారణం. తండ్రి, తాతల ఆస్తిపై కొడుకులకు, కూతుళ్లకు సమాన హక్కులు ఉంటాయన్న విషయం చాలామందికి తెలుసు. అయితే తల్లి పేరు మీద ఉన్న ఆస్తిపై కూతుళ్లకు ఎలాంటి హక్కులు ఉంటాయి? తల్లి ఎలాంటి వీలునామా రాయకుండా మరణిస్తే ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది? ఈ విషయంలో హిందూ, ముస్లిం వ్యక్తిగత చట్టాలు వేర్వేరు నిబంధనలను నిర్దేశించాయి.
హిందూ వారసత్వ చట్టం (1956) ప్రకారం నిబంధనలు
హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. తల్లి తన స్వార్జిత లేదా వారసత్వ ఆస్తికి సంబంధించి ఎలాంటి వీలునామా రాయకుండా కన్నుమూస్తే, ఆ ఆస్తి ఆమె చట్టబద్ధ వారసులకు సమానంగా చెందుతుంది.
భర్త, పిల్లలకు సమాన వాటా: తల్లి ఆస్తిపై ఆమె భర్తతో పాటు పిల్లలందరికీ సమాన హక్కు ఉంటుంది.
పెళ్లయినా కూతురికి పూర్తి హక్కు: కూతురుకు వివాహం అయినప్పటికీ, తల్లి ఆస్తిలో వాటా పొందే పూర్తి హక్కు ఆమెకు ఉంటుంది. కొడుకుతో సమానంగా కూతురు కూడా వాటాను క్లెయిమ్ చేసుకోవచ్చు.
పిల్లలు లేకపోతే పరిస్థితి ఏంటి?: సదరు మహిళకు పిల్లలు లేకపోతే, ఆ ఆస్తి ఆమె భర్త కుటుంబ సభ్యులకు చెందుతుంది. భర్త, అతని కుటుంబ సభ్యులు కూడా లేని పక్షంలో ఆస్తి మహిళ యొక్క తల్లిదండ్రులు లేదా తోబుట్టువులకు బదిలీ అవుతుంది.
ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం నిబంధనలు
ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆస్తి పంపకాల నియమాలు భిన్నంగా ఉంటాయి. ముస్లిం మహిళ మరణానంతరం ఆమె ఆస్తి ఆటోమేటిక్‌గా సమానంగా పంపిణీ కాదు.
కొడుకుకు రెట్టింపు వాటా: షరియా నిబంధనల ప్రకారం.. ఆస్తిలో కూతురు వాటా కంటే కుమారుడికి రెట్టింపు వాటా లభిస్తుంది.
వివాహిత కుమార్తెలకు: పెళ్లయిన కూతురు కూడా ఆస్తిని క్లెయిమ్ చేసుకోవచ్చు, కానీ ఆమె వాటా సోదరుడి వాటాలో సగం మాత్రమే ఉంటుంది.
తల్లి బతికున్నప్పుడే వీలునామా రాసి ఉంటే మాత్రమే ఈ నిష్పత్తిలో మార్పులు సాధ్యమవుతాయి.
సవతి పిల్లల పరిస్థితి ఏంటి?
మహిళ భర్తకు మరొక భార్య ద్వారా జన్మించిన పిల్లలకు ఆమె ఆస్తిపై ఎలాంటి స్వతంత్ర హక్కు ఉండదు. అయితే ఆమె వారిని చట్టబద్ధంగా దత్తత తీసుకున్నా లేదా తన వీలునామాలో ప్రత్యేకంగా వారి పేర్లను ప్రస్తావించినా మాత్రమే వారికి వాటా లభించే అవకాశం ఉంటుంది.
ఆస్తిని క్లెయిమ్ చేయడానికి అవసరమైన పత్రాలు
తల్లి మరణం తర్వాత ఆమె ఆస్తిని చట్టబద్ధంగా తమ పేరిట మార్చుకోవడానికి ఈ క్రింది డాక్యుమెంట్లు అవసరం:
- తల్లి మరణ ధృవీకరణ పత్రం
- చట్టబద్ధ వారసత్వ ధృవీకరణ పత్రం
- ఒరిజినల్ ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాలు
- ఒకవేళ వీలునామా ఉన్నట్లయితే దానికి సంబంధించిన ప్రొబేట్ కాపీ.
కుటుంబ కలహాలు, సరైన అవగాహన లేదా పత్రాలు లేకపోవడం వల్ల చాలామంది మహిళలు తమ న్యాయమైన ఆస్తి హక్కులను కోల్పోతున్నారు. తల్లి బతికుండగానే రిజిస్టర్డ్ వీలునామా రాయడం ద్వారా భవిష్యత్తులో వచ్చే వివాదాలకు ముగింపు పలకవచ్చు. ఆస్తి పంపకాలలో ఏవైనా సందేహాలు లేదా న్యాయపరమైన చిక్కులు ఉంటే వెంటనే నిపుణులైన సివిల్ న్యాయవాదిని సంప్రదించి సలహా తీసుకోవడం ఉత్తమం.
