Credit Card: దీపావళి ఆఫర్లతో మీ సిబిల్ స్కోర్‌ మటాష్.. ఈ తప్పులు చేశారో..

ఆఫర్‌లకు ఆశపడి క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్ తీసుకుంటే జరిగే నష్టాలు ఏమిటి..? క్రెడిట్ లిమిట్‌లో 30శాతం కంటే ఎక్కువ వాడకూడదు వంటి ఆర్థిక నిబంధనలను ఎందుకు పాటించాలి..? సకాలంలో బిల్లులు కట్టకపోతే భవిష్యత్తులో లోన్స్ దొరకడం కష్టమవుతుంది కాబట్టి ఈ పండుగ వేళ ఆర్థికంగా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం..

Credit Card: దీపావళి ఆఫర్లతో మీ సిబిల్ స్కోర్‌ మటాష్.. ఈ తప్పులు చేశారో..
How Festive Deals Can Ruin Your Credit Score

Updated on: Oct 17, 2025 | 8:43 PM

దీపావళి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లన్నీ షాపింగ్‌తో కళకళలాడుతున్నాయి. ఈ పండుగ సీజన్‌లో దుకాణాలు, షోరూమ్‌లు రకరకాల డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్‌లు ప్రకటిస్తుంటాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డులపై వచ్చే ఆఫర్‌లు కస్టమర్‌లను మరింతగా ఆకర్షిస్తాయి. అయితే ఈ ఆఫర్‌ల ఉచ్చులో పడి చాలామంది తమ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీసుకుంటున్నారు. మీ దీపావళి షాపింగ్ ఆనందం మీ ఆర్థిక భవిష్యత్తుపై ప్రభావం చూపకుండా ఉండాలంటే.. ఈ ముఖ్యమైన విషయాలను తప్పక గుర్తుంచుకోవాలి.

బడ్జెట్‌లోనే షాపింగ్ చేయండి

పండుగ సీజన్‌లో ఆఫర్‌లు చూసి చాలామంది భారీగా కొనుగోళ్లు చేస్తుంటారు. కొన్నిసార్లు అవసరం లేని వస్తువులను కూడా డిస్కౌంట్ల కోసం కొనేస్తారు. క్రెడిట్ కార్డ్ ఆఫర్‌ల కోసం కార్డు పరిమితిని పూర్తిగా లేదా అధికంగా ఉపయోగించడం క్రెడిట్ స్కోర్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. మీరు మీ క్రెడిట్ కార్డు పరిమితిలో 30శాతం కంటే ఎక్కువ వినియోగించకుండా చూసుకోవాలి. మీ బడ్జెట్‌లో మాత్రమే షాపింగ్ చేయండి.

సకాలంలో బిల్లులు..

పండుగ ఉత్సాహంలో క్రెడిట్ కార్డుల సహాయంతో ఇష్టానుసారం కొనేయడం జరుగుతుంది. దీనివల్ల నెల నెలా వచ్చే క్రెడిట్ కార్డ్ బిల్లులు బడ్జెట్‌ను దెబ్బతీస్తాయి. బిల్లు భారీగా ఉండటం వలన నెలాఖరులో చెల్లించలేకపోతే, అది మీ క్రెడిట్ స్కోర్‌ను నేరుగా తగ్గిస్తుంది. లేట్ ఛార్జీలు కూడా అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఎంత షాపింగ్ చేసినా, దాన్ని నిర్ణీత గడువులోగా పూర్తిగా చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి. లేదంటే క్రెడిట్ కార్డు వాడకాన్ని నియంత్రించుకోండి.

పర్సనల్ లోన్స్‌పై తొందర వద్దు

కొంతమంది పండుగ అవసరాల కోసం, ముఖ్యంగా షాపింగ్ కోసం, తొందరపడి పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. ఈ రుణాలను తీసుకునేటప్పుడు EMI చెల్లింపుల గురించి సరిగ్గా ప్లాన్ చేసుకోరు. ఈఎంఐకి తగ్గట్టుగా తమ నెలవారీ బడ్జెట్‌ను సిద్ధం చేయరు. EMIలు చెల్లించలేకపోతే ఆ లోపాలు మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. భవిష్యత్తులో గృహ రుణాలు లేదా కారు రుణాలు తీసుకోవడం కష్టమవుతుంది.

ఆఫర్‌లు కేవలం తాత్కాలికమే.. కానీ బలమైన క్రెడిట్ స్కోర్ మీకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను ఇస్తుంది. అందుకే దీపావళి షాపింగ్‌ను ప్లాన్ చేసుకునేటప్పుడు, క్రెడిట్ స్కోర్‌ను కాపాడుకోవడంపై కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..